విచారణ కమిటీ ముందుకు వెళ్లనున్న సీఎం

12 Jan, 2016 18:05 IST|Sakshi
విచారణ కమిటీ ముందుకు వెళ్లనున్న సీఎం

దాదాపు 7 కోట్ల రూపాయల సోలార్ స్కాంపై విచారణ జరుపుతున్న జస్టిస్ జి.శివరాజన్ ఏకసభ్య కమిటీ ముందు విచారణకు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ హాజరు కానున్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న చాందీ.. ఇప్పటికే కమిషన్‌కు లిఖిత వాంగ్మూలం ఇచ్చారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కమిటీ ఎదుట హాజరవుతానని చెప్పారు. చాందీ ప్రకటనను రికార్డు చేసేందుకు కమిటీ తిరువనంతపురం రానుంది. 2013 జూన్ నెలలో సోలార్ స్కాం వెలుగుచూసిన తర్వాత.. దానిపై విచారణ కోసం కేరళప్రభుత్వం 2013 అక్టోబర్ నెలలో జస్టిస్ శివరాజన్ కమిటీని నియమించింది. సోలార్ ప్యానళ్లు ఇప్పిస్తామంటూ డబ్బు తీసుకుని చాలామంది పెట్టుబడిదారులను ఓ జంట మోసం చేసింది. ఆ జంటతో సీఎం కార్యాలయంలోని ఉన్నతాధికారులకు సంబంధాలు ఉండటంతో, వాళ్లను వెంటనే ఆ పదవుల నుంచి తప్పించారు.

ఈ కేసులో సరితా నాయర్, ఆమె సహజీవన భాగస్వామి బిజు రాధాకృష్ణన్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం సరితా నాయర్ బెయిల్‌ మీద బయటకు రాగా, రాధాకృష్ణన్ ఇంకా కస్టడీలోనే ఉన్నారు. ఆయన తన మొదటి భార్యను హత్య చేసిన విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనిపై సభలోను, బయట కూడా భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో ఈ ఘటనపై చాందీ జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణ ఎదుర్కొనేందుకైనా సిద్ధమేనని చాందీ అంటున్నారు.

మరిన్ని వార్తలు