ఉచితంగా ఓపెన్ జిమ్

29 Jul, 2014 22:38 IST|Sakshi
ఉచితంగా ఓపెన్ జిమ్

న్యూఢిల్లీ: లోధీ గార్డెన్‌లో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ అందుబాటులోకి వచ్చింది. దీనిని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి మంగళవారం ప్రారంభించారు. ఇదే తరహాలో మరికొన్ని ఓపెన్‌జిమ్‌లను మరో 28 చోట్ల ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఎన్‌డీఎంసీ ప్రాజెక్టు డెరైక్టర్ ఓపీ మిశ్రా వెల్లడించారు. ‘ఓపెన్ జిమ్‌లు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచాలనేదే మా ఆలోచన. తొలుత వీటిని ఉద్యానవనాల్లో ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత పాఠశాలలు, రెసిడెన్షియల్ కాలనీలతోపాటు పేవ్‌మెంట్లపైనా ఏర్పాటు చేస్తాం. ఓపెన్ జిమ్‌లలోని పరికరాల వినియోగానికి విద్యుత్ అవసరమే లేదు. నిర్వహణ వ్యయం కూడా తక్కువే. ఒక్కొక్క జిమ్ ఏర్పాటుకు రూ. 5.5 లక్షల వ్యయం అవుతోంది. ఇలా ఉద్యానవనాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయ డం ఇదే తొలిసారి.
 
 జిమ్‌కు వెళ్లే స్తోమత అందరికీ ఉండదు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడమే మా లక్ష్యం. ఏ వయసు వారైనా వీటిని వినియోగించుకోవచ్చు. జిమ్‌లకు వెళ్లేందుకు సీనియర్ సిటిజన్లు ఇష్టపడరు. అయితే వారు కేవలం మార్నింగ్ వాక్‌కు మాత్రమే వస్తారు. ఓపెన్ జిమ్‌ల ఏర్పాటువల్ల వాటిని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. వారు వాకింగ్‌తో పాటు వ్యాయామంవైపు కూడా ఇకమీదట దృష్టి సారిస్తారు’ అని అన్నారు. కాగా సెంట్రల్ పార్కు (కన్నాట్‌ప్లేస్), సంజయ్ పార్కు, తాల్‌కటోరా స్టేడియం, నెహ్రూ పార్కు, ఎన్డీఎంసీ క్లబ్ తదితర ప్రాంతాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయనుంది. ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 40 లక్షల  నిధుల్ని కేటాయించింది. వీటి ఏర్పాటుకు అనువైన పేవ్‌మెంట్ల కోసం ఎన్‌డీఎంసీ అన్వేషిస్తోంది. లోధీ గార్డెన్‌కు సందర్శకులు అత్యధిక సంఖ్యలో వస్తుంటారు.
 

మరిన్ని వార్తలు