కమ్మేసిన మంచుపొగ.. నిలిచిపోయిన విమానాలు!

1 Jan, 2018 09:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీని మంచుపొగ కమ్మేసింది. దట్టంగా మంచుపొగ అలుముకోవడం, వెలుతురు మందగించడంతో సోమవారం ఉదయం విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. వెలుతురు మరీ మందగించడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైమానిక సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఐదు దేశీ విమానాలు, ఏడు అంతర్జాతీయ విమానాలకు అంతరాయం ఏర్పడింది. ఒక విమాన సర్వీస్‌ను రద్దుచేశారు. హస్తినలో వెలుతురు మందగించి.. మంచుపొగ దట్టంగా అలముకోవడంతో ఉదయమైనా చిమ్మచీకటి అలుముకుంది.

నగరంలోని పలు ప్రాంతాల్లో వాయుకాలుష్యం కూడా ప్రమాదకరస్థాయికి చేరడం గమనార్హం. వాయునాణ్యత సూచీలో నగరంలోని షాదిపూర్‌లో 332, సిరి ఫోర్ట్‌లో 388 పాయింట్లు (రెండు కూడా అత్యంత ప్రమాదకరం) నమోదవ్వగా.. ద్వారకలో 257 పాయింట్లు (తీవ్ర అనారోగ్యకరం), ఐటీవోలో 182పాయింట్లు (అనారోగ్యకరం) నమోదైంది. అటు ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో దట్టమైన పొగమంచు కారణంగా వైమానిక సేవలకు అంతరాయం కలిగింది.

మరిన్ని వార్తలు