ఆన్‌లైనే అడ్డా..

16 Jul, 2017 03:21 IST|Sakshi
ఆన్‌లైనే అడ్డా..
సామాజిక మాధ్యమాల ద్వారా పాక్‌ నిషేధిత తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు
 
భారత్‌పై పాకిస్తాన్‌ ఒకవైపు విషం చిమ్ముతూనే మరోవైపు తన ద్వంద్వనీతిని చాటుతోంది. జమ్మూ, కశ్మీర్‌లో చొరబాట్లకు, భారత్‌ సైన్యంపై దాడులు , సీమాంతర ఉగ్రవాదానికి చేదోడువాదోడుగా నిలుస్తున్న సంస్థలకు పరోక్షంగా పాక్‌ మద్దతునిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేలా అమెరికా, అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లతో ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి, విద్వేషాలను రెచ్చగొడుతున్న 65 సంస్థలను పాక్‌ ప్రభుత్వం నిషేధించింది. ఈ సంస్థలు తీవ్రవాదులను రిక్రూట్‌ చేయడంతో పాటు కశ్మీర్‌లో భారత్‌ వ్యతిరేక పోరాటానికి మద్దతు కూడగట్టడం, విరాళాల సేకరణ ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు బాసటగా నిలుస్తున్నాయి.

అయితే ఈ సంస్థలు నిషేధానికి గురైనా సామాజిక మాధ్యమాల ద్వారా చురుకుగా తమ కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు అక్కడి సామాజికవేత్తలు, జర్నలిస్టులు, హక్కుల సంఘాల నాయకులు బయటపెట్టారు. పాక్‌ సైన్యం, రాజకీయనాయకుల అండదండలతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆన్‌లైన్‌లో ఈ సంస్థలు యథావిధిగా ‘తమ పనులు’చక్కబెడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఫేస్‌బుక్‌లో తీవ్రవాదానికి చోటు లేదని ఈ మాధ్యమ నిర్వాహకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. 
 
నిషేధానికి గురైన 65 సంస్థల్లో ఒకటైన లష్కరే ఇస్లామ్‌ ఫేస్‌బుక్‌ పేజీలో ఆయుధాలతో ఉన్న ముగ్గురు మనుషుల నీడలు స్వాగతం పలుకుతాయి. మరో సంస్థ పేజీలో అఫ్గాన్‌ తాలిబాన్‌ జెండా స్వాగతం పలుకుతుండగా, ఈ సైట్‌ పైభాగంలో ఈ పేజీ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌కు చెందినదిగా పేర్కొన్నారు. ఇప్పటికీ నలభైకి పైగా సంస్థలు ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్సాప్, టెలిగ్రామ్‌ మాధ్యమాల ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని పాక్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) సీనియర్‌ అధికారే Ðð ల్లడించారు. ఈ సైట్లకు మూతవేసే బాధ్యతను ఎఫ్‌ఐఏకే అప్పగించారు. ఈ నిషేధిత సంస్థలు ప్రాక్సీ సర్వర్ల ద్వారా వేరే దేశాల ఐపీ అడ్రస్‌ల ద్వారా పనిచేస్తుండడంతో కనిపెట్టడం కష్టమవుతోందని అధికారులు అంటున్నారు.. అయితే ఈ సైట్లను బ్లాక్‌ చేయవచ్చునని, ఎక్కడి నుంచి పనిచేస్తున్నారో కనిపెట్టి ఆ పేజీలను నిలిపివేయవచ్చునని హరూన్‌ బలూచ్‌ అనే సోషల్‌మీడియా హక్కుల కార్యకర్త చెబుతున్నారు.

కశ్మీర్, అఫ్గానిస్తాన్‌లలో పవిత్రయుద్ధానికి ప్రోత్సాహం, పాక్‌లోని మైనారిటీ షియాలపై సున్నీలను రెచ్చగొట్టడం వంటి వాటికి ఈ సంస్థలు పాల్పడుతున్నాయి. ఒక ఫేస్‌బుక్‌ సైట్‌లో అయితే అమెరికా నిషేధిత ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ గురించి పొందుపరిచింది. సయీద్‌ తలపై కోటి డాలర్ల వెలను అమెరికా ప్రకటించినా ఆయన గ్రూపు మాత్రం మరెన్నో పేర్లతో మళ్లీ మళ్లీ జీవం పోసుకుంటోంది. ఇవి సామాజికసేవను నిర్వహిస్తున్నట్లుగా ఎన్నో ఫేస్‌బుక్‌ పేజీలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఫలాహ్‌–ఏ–ఇన్‌సానియత్‌ పేరిట సంఘ సేవలో నిమగ్నమైనట్లు ఈ సంస్థలు గొప్పలు చెప్పుకుంటున్నా ఈ సైట్లలో భారత్‌ వ్యతిరేక వీడియోలు, అమెరికాకు పాక్‌ వంత పాడడం పట్ల ఖండన వంటివి పెట్టారు.‘ఇది నిషేధించిన గ్రూపులు ఆన్‌లైన్‌లో పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉంది’అంటూ ఒక ఎఫ్‌ఐఏ అ««ధికారి అసోసియేటెడ్‌ ప్రెస్‌ ప్రతినిధికి తెలిపారు. క్షేత్రస్థాయిలో మసీదులు, మదర్సాల కనెక్టివిటీతో ఈ సంస్థల మద్దతుదారులు తమ ప్రచారాన్ని తీవ్రతరం చే స్తూ మరింత బలపడుతున్నారు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
మరిన్ని వార్తలు