కోటాపై వాగ్యుద్ధం

11 Feb, 2020 04:36 IST|Sakshi

సుప్రీంకోర్టు ఆదేశాలపై వేడెక్కిన లోక్‌సభ

తాము కక్షిదారుకాదన్న ప్రభుత్వం 

న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా అనేది ప్రభుత్వాలే నిర్ణయిస్తాయంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించిన కేసులో తాము కక్షిదారు కాదని కేంద్రం స్పష్టం చేసింది. రిజర్వేషన్‌ విధానాన్ని పరిరక్షించడంలో కేంద్రం విఫలమైందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో లోక్‌సభలో ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేసింది. సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ సోమవారం సభలో.. ‘ఎస్సీ, ఎస్టీలోపాటు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉంది. ఈ విషయంలో అఫిడవిట్‌ వేయాలని సుప్రీం కోరలేదు. ఈ అంశాన్ని ప్రభుత్వం ఉన్నతస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. 2012లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి’అని ఆరోపించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు సిగ్గు, సిగ్గు అని నినాదాలు చేసుకుంటూ సభ నుంచి వాకౌట్‌ చేశారు.

అంతకుముందు, ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ ఈ విషయాన్ని లేవనెత్తారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పేందుకు ఎన్నో ఆధారాలున్నాయని డీఎంకే సభ్యుడు ఎ.రాజా, బీఎస్‌పీ నేత రితేశ్‌ పాండే వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని సీపీఎం నేత ఏఎం అరీఫ్‌ ప్రభుత్వాన్ని కోరారు. మరో వైపు రాజ్యసభలో... అసమర్థులైన వైద్యుల కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉందని కాంగ్రెస్‌ నేత చిదంబరం అన్నారు. సోమవారం సభలో ఆయన వార్షిక బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ..  పెరుగుతున్న నిరుద్యోగిత, పడిపోతున్న వినియోగం అనే రెండు సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటుండగా ప్రభుత్వం మాత్రం ఖండించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ‘అన్ని రకాల పన్ను వసూళ్లు మందగించాయి. ఆరేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ..ఇంకా గత పాలకులను ఎలా విమర్శిస్తుంది? అని అన్నారు.

మరిన్ని వార్తలు