జస్టిస్‌ లోయా మృతిపై ఎన్నో అనుమానాలు: రాహుల్

9 Feb, 2018 19:38 IST|Sakshi
రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన అనంతరం రాహుల్ గాంధీ

సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ దివంగత జడ్జి బ్రిజ్‌గోపాల్ హర్‌కిషన్ లోయా (బీహెచ్‌ లోయా) మృతికి సంబంధించి అంశాలపై ఫిర్యాదు చేసేందుకు విపక్ష నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షనేతలు శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతిని కలుసుకుని జస్టిస్ బీహెచ్‌ లోయా మృతిపై తమకు చాలా అనుమానాలున్నాయని తెలిపారు. లోయా మృతిపై సిట్‌తో కేసు దర్యాప్తు జరిపించాలని రాహుల్ గాంధీ, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. లోయా మృతిపై ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు. కేసును తప్పుదోవ పట్టించే యత్నాలు జరుగుతున్నాయని విపక్ష నేతలు రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించారు.

అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. జస్టిస్ లోయా మృతిపై 15 పార్టీలకు చెందిన 114 మంది ఎంపీలు సంతకాలు చేసిన పిటిషన్‌ను రాష్ట్రపతి కోవింద్‌కు అందజేశాం. 13 పార్టీలకు చెందిన నేతలు సిట్‌ విచారణకు ఆదేశించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాం. జస్టిస్ లోయా మృతితో పాటు మరో కేసుల్లో అనుమానాలున్నాయని తెలిపాం. విచారణ కోసం తాము చేసిన విజ్ఞప్తిపై రాష్ట్రపతి కోవింద్ సానుకూలంగా స్పందించారని రాహుల్ వివరించారు.

మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా నిందితుడిగా ఉన్న సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును విచారిస్తుండగానే 2014 డిసెంబర్‌ 1న లోయా అనుమానాస్పద స్థితిలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జస్టిస్ లోయా కేసు విచారించనున్న ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి జస్టిస్ దీపక్‌ మిశ్రా నేతృత్వం వహించనున్నారు. అంతకుముందు ఈ బెంచ్‌లో ఉన్న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాను పక్కకు తప్పించారు.

మరిన్ని వార్తలు