వైదిక్‌పై చర్య తీసుకోవలసిందే

17 Jul, 2014 02:48 IST|Sakshi
వైదిక్‌పై చర్య తీసుకోవలసిందే

శివసేన డిమాండ్
 
దేశద్రోహితో భేటీపై ఉపేక్ష తగదంటూ మోడీ సర్కార్‌పై ఒత్తిడి
బాధ్యతనుంచి ప్రభుత్వం తప్పుకో జాలదని ‘సామ్నా’ సంపాదకీయం
 

ముంబై/న్యూఢిల్లీ:  దేశద్రోహి హఫీజ్‌ను కలిసి వచ్చిన   యోగా గురువు బాబా రాందేవ్ అనుచరుడు, జర్నలిస్టు వేద్‌ప్రకాశ్ వైదిక్‌పై ప్రభుత్వం చర్యతీసుకోవలసిందేనంటూ బీజేపీ మిత్రపక్షమైన శివసేన తాజాగా ఒత్తిడి పెంచింది. వీరి భేటీతో సంబంధమేలేద ంటూ ప్రకటించినంత మాత్రాన సరిపోదని, ఈ విషయంలో ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించకుండా తప్పుకోజాలదని స్పష్టంచేసింది. శివసేన తన సొంత పత్రిక ‘సామ్నా’ బుధవారంనాటి సంచిక సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఇపుడు ఒక జర్నలిస్టును వదిలివేస్తే రేపు మరొకరు వెళ్లి దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, హఫీజ్ సయీద్‌లాంటి వారితో బిర్యానీ తిని వస్తారు.. ఇది ఉపేక్షించే విషయం కాదు..’ అంటూ  వ్యాఖ్యానించింది.

వైదిక్ జాతీయతావాది: ఆరెస్సెస్

వైదిక్ జాతీయతా వాది అని, ఆయన ఏం చేసిన అది జాతీయ ప్రయోజనాలకోసమేనని ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ బుధవారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు.  కాగా, హఫీజ్-వైదిక్ భేటీ భారత్‌లో ప్రకంపనాలు సృష్టించిందంటూ పాకిస్థాన్ పత్రిక డైలీ టైమ్స్ వ్యాఖ్యానించింది.  
 వైదిక్‌పై దేశద్రోహం కేసు.. హఫీజ్‌తో భేటీ అయిన వైదిక్‌పై వారణాసిలో దేశద్రోహం కేసు నమోదైంది.  కేసీ త్రిపాఠీ అన్న న్యాయవాది పిటిషన్‌మేరకు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది.

‘ముంబై దాడులపై వైఖరిలో మార్పు  లేదు’

ముంబై  దాడులపై ప్రభుత్వం లోపాయికారిగా, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తోందంటూ వచ్చిన ఆరోపణలను హోం మంత్రి రాజ్‌నాథ్ ఖండించారు.   ఈ అంశంపై తమ దృక్పథంలో ఎలాంటి మార్పూలేదని రాజ్యసభలో స్పష్టం చేశారు. ఈ దాడులకు సంబంధించి బీజేపీ నేత  సుధీంద్ర కులకర్ణి సమాంతర దౌత్యం నెరిపినట్టుగా తెలిసిందని, ప్రభుత్వ వైఖరేమిటో తెలియాలని కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ శుక్లా చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ స్పందించారు.

కాశ్మీర్‌పై బీజేపీ వైఖరి మారిందా?..దిగ్విజయ్

హఫీజ్-వైదిక్ భేటీపై చెలరేగిన వివాదం నేపథ్యంలో కాశ్మీర్‌పై తన వైఖరి పూర్తిగా మారిందా? అన్న విషయం బీజేపీ స్పష్టంచేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు