సీఏఏను వెనక్కు తీసుకోండి

14 Jan, 2020 01:55 IST|Sakshi
కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాతో రాహుల్, ఆజాద్, ఏచూరి, రాజా, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌

ఎన్పీఆర్, ఎన్నార్సీలను ఆపేయండి 

విపక్ష పార్టీల ఉమ్మడి తీర్మానం 

కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ నేతృత్వంలో సమావేశం 

హాజరైన 20 పార్టీలు 

డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, ఆప్, శివసేన డుమ్మా

న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా విపక్షం ఒక్కటైంది. దేశంలో ప్రతిఘటనా స్ఫూర్తి మేల్కొందని నినదించింది. సీఏఏను వెనక్కు తీసుకోవాలని, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ ప్రక్రియలను తక్షణమే నిలిపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ నేతృత్వంలో సోమవారం ఢిల్లీలో 20 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. అనంతరం సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా ఒక ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ ప్యాకేజీ(సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌) రాజ్యాంగ విరుద్ధమని, పేదలు, అణగారిన వర్గాలు లక్ష్యంగా తీసుకువచ్చిన కార్యక్రమమని అందులో పేర్కొన్నాయి. ‘ఈ ప్యాకేజీ రాజ్యాంగ విరుద్ధం. ఇది పేదలు, అణగారిన వర్గాలు, ఎస్సీఎస్టీలు, భాషాపరమైన, మతపరమైన మైనారిటీలు లక్ష్యంగా రూపొందింది.

ఎన్నార్సీకి ఎన్పీఆర్‌ ప్రాతిపదిక. సీఏఏను ఉపసంహరించుకోవాలని, ఎన్పీఆర్, ఎన్నార్సీ ప్రక్రియలను తక్షణమే నిలిపేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని ఆ తీర్మానంలో స్పష్టం చేశాయి. ఎన్నార్సీని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ప్రకటించిన ముఖ్యమంత్రులంతా.. ఎన్పీఆర్‌ అమలును కూడా నిలిపేయాలని అందులో కోరారు. మతపరంగా దేశాన్ని విభజించే ప్రమాదకర కార్యక్రమాన్ని బీజేపీ ప్రారంభించిందని తీర్మానంలో ఆరోపించారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి అయిన జనవరి 23న, గణతంత్ర దినోత్సవమైన జనవరి 26, గాంధీజీ వర్ధంతి అయిన జనవరి 30న జరిపే రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీల్లో పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రిపబ్లిక్‌ డే రోజు రాజ్యాంగ ప్రవేశికను చదివి, దాని పరిరక్షణ కోసం పాటు పడ్తానని ప్రతిజ్ఞ చేయాలని కోరారు. అయితే, ఈ సమావేశానికి ఆరు కీలక విపక్ష పార్టీలు.. డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ, శివసేన హాజరుకాలేదు. 

బీజేపీ విద్వేష రాజకీయాలు: సోనియా 
సమావేశంలో సోనియాగాంధీ మాట్లాడుతూ.. ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం తదితర దేశం ఎదుర్కొంటున్న అసలైన సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా దేశంలో భయాందోళనలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీఏఏ, ఎన్నార్సీల విషయంలో దేశాన్ని వారు తప్పుదోవ పట్టించారన్నారు. దేశంలో అసాధారణ రీతిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం ఒకవైపు విద్వేషాలను రగిలిస్తూ.. మరోవైపు ప్రజలను వర్గాలుగా విభజిస్తోందని ఆరోపించారు. ‘బీజేపీ ప్రణాళిక ప్రకారం జేఎన్‌యూపై జరిపిన దాడులను దేశం మొత్తం భయాందోళనలతో చూసింది. జామియా మిలియా ఇస్లామియా, బనారస్‌ హిందూ యూనివర్సిటీ, అలహాబాద్‌ ముస్లిం యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి’ అన్నారు. యువత చేపట్టిన ఆందోళనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని, ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టాలు ఈ ఆందోళనకు కారణమని అనిపిస్తున్నా.. దీనివెనుక ఎంతో కాలంగా గూడుకట్టుకున్న నిస్పృహ కూడా ఉందని, ఈ రూపంలో యువత తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని సోనియా వివరించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసుల తీరు ఏకపక్షంగా ఉందని ఆరోపించారు.   

పాకిస్తాన్‌కు సంతోషం 
సీఏఏను వ్యతిరేకిస్తూ విపక్షాలు చేసిన తీర్మానం పాకిస్తాన్‌కు సంతోషం కలిగించి ఉంటుందని బీజేపీ వ్యాఖ్యానించింది. ఆ తీర్మానంతో దేశ భద్రతకు కానీ, జాతి ప్రయోజనాలకు కానీ ఎలాంటి ఉపయోగం లేదని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. ఆరు విపక్ష పార్టీలు ఆ సమావేశానికి హాజరు కాకపోవడంపై స్పందిస్తూ.. ‘వారి ఐకమత్యం అలా బయటపడింది’ అన్నారు. మైనారిటీలపై పాకిస్తాన్‌ పాల్పడుతున్న హింసను ప్రపంచానికి చూపేందుకు ఆ చట్టం ద్వారా మంచి అవకాశం లభించిందన్నారు.

ఏ క్యాంపస్‌కైనా వెళ్లి చూడండి 
దేశం కోసం ఏం చేయబోతున్నారో దేశంలోని ఏ యూనివర్సిటీ క్యాంపస్‌కైనా వెళ్లి మాట్లాడాలని ప్రధానికి కాంగ్రెస్‌  నేత రాహుల్‌ గాంధీ సవాలు చేశారు. ‘యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరుద్యోగం ఎందుకు పెరిగిపోయిందో, ఆర్థిక వ్యవస్థ ఎందుకు కుదేలైందో  విద్యార్థులకు వివరించేందుకు ప్రధాని ధైర్యం తెచ్చుకోవాలి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆయనకు ఆ దమ్ము లేదు’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ‘ఏ విశ్వవిద్యాలయానికైనా వెళ్లండి.. దేశానికి ఏం చేయబోతున్నారో చెప్పండి’ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, ఎల్జేడీ చీఫ్‌ శరద్‌ యాదవ్,వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా, సీఎం హేమంత్‌ సోరెన్‌ హాజరయ్యారు.

మరిన్ని వార్తలు