మార్చురీల్లోనే అనాథ శవాలు

19 Nov, 2014 22:41 IST|Sakshi

 సాక్షి, ముంబై: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మార్చురీలో 119 అనాథ శవాలు అలాగే పడి ఉన్నాయి. బంధువులెవరూ రాకపోవడం ఆస్పత్రి యాజమాన్యాలకు తలనొప్పిగా పరిణమించింది. నియమ, నిబంధనల ప్రకారం వాటికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. ఆస్పత్రుల యాజమాన్యాలు పలుమార్లు లిఖిత పూర్వకంగా పోలీసులకు తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో ఏడు నెలల నుంచి అవి శవాల గదిలో అలాగే ఉన్నాయి. నగరంలో జే.జే.,రాజావాడి, కూపర్, భగవతి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు.

 గత మూడేళ్ల నుంచి అనాథ శవాల సంఖ్య పెరుగుతోంది. దీంతో మున్ముందు ఇబ్బందులను ఎదుర్కోక తప్పదని ఆస్పత్రి యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. వీటిని ఇంకెంత కాలం భద్రపర్చాలో అర్థం కాక ఆస్పత్రి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. దేశ ఆర్థిక రాజాధాని నగరమైన ముంబైకి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఉపాధి నిమిత్తం వస్తుంటారు. కొందరు కుటుంబ కలహాలతో ఇంటి నుంచి పారిపోయి వస్తుంటారు. మరికొందరు మానసిక స్థితి సరిగాలేక ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడే ఉండిపోతారు. ఇలాంటి వారి తాలూకు వివరాలుగానీ, చిరునామాగానీ ఉండదు. ఇలా వచ్చిన వారంత రైల్వే ప్లాట్‌ఫాంలు, స్టేషన్ బయట ఉన్న ఖాళీ స్థలాలు, బస్టాండ్ పరిసరాల్లో ఉంటుంటారు.

ఆనారోగ్యంతో లేదా ప్రమాదవశాత్తు చనిపోతే వీరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రారు. ఇలాంటి అనాథ శవాలను పోలీసులు ఆస్పత్రులకు తరలించి చేతులు దులుపేసుకుంటున్నారు. ఆ తరువాత వైద్యులు వాటికి పోస్టుమార్టం నిర్వహించి మార్చురీలో భద్రపరుస్తారు. వారికి సంబంధించిన దస్తులు, ఆనవాళ్లు, ఇతర వస్తువులు స్టోర్ రూంలో భద్రపరుస్తారు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ వారి బంధువులెవరూ రాకపోవడంతో ఆస్పత్రిలో శవాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో వాటిని నెలల తరబడి భద్రపర్చడం  సవాలుగా మారింది. ప్రస్తుతం భగవతి ఆస్పత్రిలో 54, జే.జే ఆస్పత్రిలో 18, కూపర్ ఆస్పత్రిలో 20 అనాథ శవాలున్నాయి.

మరిన్ని వార్తలు