ఇప్పుడు ఆ పాప అనాథ కాదు

9 Jun, 2015 12:57 IST|Sakshi
ఇప్పుడు ఆ పాప అనాథ కాదు

ఈస్ట్ సింగ్బమ్ (జార్ఖండ్): ఆమె వయసు 11 ఏళ్లు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. పొట్ట పోసుకోడానికి అడవి నుంచి కట్టెలు సేకరించి.. వాటిని అమ్ముకుంటోంది. అయినా.. ఒక్క రోజు కూడా స్కూలుకు డుమ్మా కొట్టలేదు. తన చదువు కొనసాగిస్తూనే ఉంది. జార్ఖండ్లోని ఈస్ట్ సింగ్బమ్ జిల్లాలో ఘట్శిలా సబ్ డివిజన్ పరిధిలోని డుమురియా బ్లాక్కి 12 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్న అష్టక్వలి ప్రాంతంలో సోంబరి ఇల్లు ఉంది. ఆ ఇంటికి కరెంటు సౌకర్యం కూడా లేదు.. కనీసం కిరోసిన్ దీపం కొనుక్కునే స్థోమత కూడా ఆమెకు లేదు.

'సోంబరి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. ఆమె తండ్రి రతన్ కూడా నెల రోజుల క్రితం చనిపోయాడు. బంధువులెవరూ ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతలు స్వీకరించలేదు. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఒంటరిగానే ఉంటూ ఐదో తరగతి చదువుతోంది. కష్టపడి పని చేసుకుంటూ కూడా ఒక్క రోజూ స్కూల్ మిస్సయేది కాదు' అని ఆ చిన్నారి చదువుకుంటున్న స్కూల్ టీచర్ అనిల్ రాయ్ తెలిపారు.

సోంబరి పరిస్థితి గురించి తెలిసిన పలు స్వచ్ఛంద సంస్థలు ఆమెకు ఆపన్న హస్తం అందించడానికి ముందుకు వచ్చాయి. టాటా స్టీల్, ఆనంద్ మార్గ్ ఆశ్రమ్ వాళ్లు సోంబరిని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. జంషెడ్పూర్లోని సిండికేట్ బ్యాంకు ఉద్యోగి, ఘట్సిలాలో టీచర్ దంపతులు కూడా సోంబరిని దత్తత తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారని.. దుమురియా బీడీఓ మృత్యుంజయ్ కుమార్ చెప్పారు. అన్ని దరఖాస్తులను జిల్లా ఉన్నత అధికారులకు పంపామన్నారు.

ప్రస్తుతం ఆ చిన్నారి తన తండ్రి మరణించి నెల కావస్తుండటంతో కర్మకాండ నిర్వహించే పనిలో ఉంది. తనను విద్యావంతురాలిగా చూడాలనేది తన తండ్రి కోరిక అని సోంబరి చెప్పింది. వంటచెరకు, విస్తరాకులకు ఉపయోగించే ఆకులను అడవి నుంచి సేకరిస్తున్నానని, దీంతో కర్మకాండల సమయంలో కూడా వంటచెరకు, విస్తరాకులకు  లోటు లేదని ఆ చిన్నారి చెబుతోంది.

మరిన్ని వార్తలు