మనసంతా భరతమాత

26 Dec, 2019 03:31 IST|Sakshi
సరూర్‌నగర్‌ మైదానంలో జరిగిన సార్వజనీన సమ్మేళనంలో వేదికపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్, మోహన్‌రెడ్డి తదితరులు

అందరి కోసం పనిచేస్తాం: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భాగవత్‌ 

ఆదర్శ హిందూ సమాజాన్ని స్థాపించటమే లక్ష్యం 

సమాజం కోసం పనిచేస్తూ భరతమాతను ఆరాధించేవారంతా హిందువులేనని స్పష్టీకరణ 

ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలపటమే లక్ష్యం. మనసు నిండా ప్రేమ భావం నింపుకొని అందరిలో కలుస్తాం.. అందరినీ కలుపుకొంటాం.. దేశాన్ని ఉన్నతంగా నిలిపే దీక్షలో సమాజంతో మమేకమై ముందుకు నడుస్తాం. అందరి కోసం పనిచేస్తాం.. ఇదే సంఘ్‌ ఉద్దేశం. 
– మోహన్‌ భాగవత్‌

సాక్షి, హైదరాబాద్‌ : ‘పేరు కోసం పాకులాడం, స్వార్థం కనిపించదు. ధన్యవాదాలను కూడా ఆశించం. ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలపటమే లక్ష్యం. మనసు నిండా ప్రేమ భావం నింపుకొని అందరిలో కలుస్తాం.. అందరినీ కలుపుకొంటాం.. దేశాన్ని ఉన్నతంగా నిలిపే దీక్షలో సమాజంతో మమేకమై ముందుకు నడుస్తాం. అందరి కోసం పనిచేస్తాం.. ఇదే సంఘ్‌ ఉద్దేశం. ఈ ప్రయాణంలో మాపై ఎన్ని నిందలు వచ్చినా.. ఎన్ని విమర్శలు ఎగసిపడ్డా లెక్క చేయం. అప్పుడప్పుడూ వాటికి స్పందిస్తూ మేం కొన్ని మాటలు అనొచ్చు.. కానీ మనసులో మాత్రం ప్రేమ భావమే ఉంటుంది. అందులో భరతమాతే కన్పిస్తుంది’అని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్, సర్‌ సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. 

సమస్త హిందూ సమాజాన్ని బాగు చేసే లక్ష్యంతో సంఘ్‌ ముందుకు సాగుతోందని, ఇందులో ఎన్ని అవరోధాలు ఎదురైనా లెక్కచేయకుండా కాగడాను తలకిందులు చేసినా, అందులోని మంట ఊర్ధ్యముఖంగా ఉన్నట్లే ముందుకు సాగుతామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో మూడు రోజులపాటు జరిగే విజయ సంకల్ప శిబిరంలో భాగంగా రెండో రోజైన బుధవారం సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించిన సార్వజనీన సమ్మేళనంలో ఆయన స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను స్పృశిస్తూ సంఘ్‌ మూల సూత్రాన్ని వివరిస్తూ వారికి దిశానిర్దేశం చేశారు. 

సార్వజనీన సమ్మేళనానికి భారీగా హాజరైన స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌

దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ, నైతిక విలువలు, విద్య, శాఖల విస్తరణే లక్ష్యంగా పాతికేళ్ల తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ సభ నిర్వహించింది. ఈ సభకు పద్మశ్రీ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, వివిధ శాఖల ముఖ్య ప్రచారక్‌లు దక్షిణామూర్తి, రామకృష్ణారావు, సుందరయ్య, పానగిరి సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్, మంగేశ్, సుహాసన్‌రావు, తిప్పే స్వామిజీ, సుధీర్‌జీ, శ్యామ్‌ప్రసాద్, సీఆర్‌ ముకుంద్‌జీలు హాజరయ్యారు. 

మనసు నిండా భరతమాతే.. 
తన కంటే సమాజమే ముఖ్యమని, దాన్ని ప్రగతి పథంలో ఉండాలని కోరుకునే వారి అవసరం ఇప్పుడు ఉందని మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. స్వాభిమానంతో సంఘటితంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే హిందూ సమాజాన్ని నిర్మించటమే సంఘ్‌ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ పయనంలో సత్ఫలితం సాధించినప్పుడే ఆర్‌ఎస్‌ఎస్‌ విజయం సాధించినట్టని చెప్పారు. ‘ఈ భూమి నాది.. దాని శ్రేయస్సే నా శ్రేయస్సు అన్న భావనతో.. ఎలాంటి భేదభావం లేకుండా సమస్త ప్రజలు నావాళ్లు అన్న అభిప్రాయంతో.. భరతమాతనే ఆరాధ్య దైవంగా భావించే వారు హిందువులు’అని తేల్చిచెప్పారు. 

చిన్నారులు, యువత, మహిళలు, పురుషులు ఎవరినైనా ఆదర్శంగా తీర్చిదిద్దటమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. నిత్యం ఓ గంట పాటు సంఘ్‌ కార్యకలాపాల్లో ఉండటమే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని సమాజం కోసం అర్పిస్తూ స్వయం సేవకులు ముందుకు సాగుతున్నారని కితాబిచ్చారు. దేవీదేవతల పూజలు పక్కన పెట్టి కేవలం భరతమాత ఆరాధనతో మాతృభూమి కోసం పనిచేస్తేనే మన దేశం విశ్వగురువు స్థానంలో నిలుస్తుందన్న వివేకానంద మాటలను తు.చ. తప్పకుండా పాటించేందుకు, ఆ మార్గంలో తాము పయనిస్తున్నామని స్పష్టం చేశారు. 

హిందూ, ముస్లింలు కీచులాడుకుని నాశనమవుతారని దేశం విడిచి వెళ్లేటప్పుడు ఆంగ్లేయులు భావించారని, కానీ అలా ఎన్నటికీ జరగదని, ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఏకత్వం వైపు సాగే ఉపాయాన్ని కనిపెడతారని ఆ ఉపాయం పేరే హిందుత్వమని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అన్న మాటలను గుర్తుచేశారు. భారత్‌ను గొప్ప దేశంగా తీర్చిదిద్దటం ఏ రాజకీయ శక్తి వల్లో.. మరే శక్తి వల్లో సాధ్యం కాదని పేర్కొన్నారు. సమాజాన్ని ఏకత వైపు నడిపించేలా చేసినప్పుడే సాధ్యమని అభిప్రాయపడ్డారు. 

ఆ శక్తులకు చోటులేదు 
సమాజంలో తామే సర్వం అనుకుంటూ ఇతరులను హింసిస్తూ, అప్పుడప్పుడూ తాము కష్టపడుతూ, తోటివారిని కష్టపెడుతూ సాధించే రాక్షస విజయాలు అవసరం లేదని పేర్కొన్నారు. అన్నీ తమకే కావాలంటూ ఇతరులను కష్టపెడుతూ తమ విజయం కోసం విధ్వంసాలకు తెగించే వారి ధన విజయాలూ తమకొద్దని, ఈ రెండు శక్తులకు హిందూధర్మంలో చోటు లేదని పేర్కొన్నారు. తమ కోసం కాకుండా ఇతరుల సౌఖ్యం కోసం పనిచేసే వారు సాధించే ధర్మ విజయాలు తమకు ముఖ్యమని, అలాంటి విజయాల కోసమే ఆర్‌ఎస్‌ఎస్‌ కష్టపడుతోందని స్పష్టం చేశారు. మనసులో తమోరజ గుణాల ప్రభావం ఉన్నా, ధర్మ భావంతో వాటిని జయిస్తున్నట్లు వెల్లడించారు. సమాజానికి ఈ లక్షణం చాలా అవసరమన్నారు.  

సమ్మేళనంలో కిషన్‌రెడ్డి, రాంమాధవ్, డీకే అరుణ తదితరులు

రాజకీయాల ప్రస్తావనే లేకుండా.. 
ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ వేల మంది సంఘ్‌ కార్యకర్తలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడుతున్నారంటే ఏవో రాజకీయపరమైన ఘాటు విమర్శలు వస్తాయన్న ఊహాగానాలు ఉన్నాయి. జాతీయ జనాభా జాబితా, జాతీయ పౌరుల జాబితా లాంటి అంశాల చుట్టూ రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో మోహన్‌ భాగవత్‌ మాట్లాడుతున్నారంటే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ప్రత్యేక శ్రద్ధగా గమనించటం సహజం. కానీ వేలమందితో ఉన్న సభా వేదికమీదుగా దాదాపు అరగంట పాటు ప్రసంగించినా ఒక్కటంటే ఒక్క పదం కూడా రాజకీయ పార్టీలపై లేకపోవటం గమనార్హం. 

పరోక్షంగా కూడా ఏ పార్టీ వ్యవహారాన్ని ఎత్తిచూపకుండా కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌ మూల సిద్ధాంతాలపైనే మాట్లాడటం విశేషం. సరిగ్గా ఆయన ప్రసంగ సమయానికే మత పెద్దల సమక్షంలో మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంతనాలు జరిపారు. బహిరంగ సభలో పాల్గొన్న వారిలో ఈ అంశం ప్రస్తావన కూడా వినిపించింది. కానీ మోహన్‌ భాగవత్‌ మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు తప్ప మరో అంశం జోలికే వెళ్లలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ పైన వచ్చే విమర్శలను కూడా రేఖా మాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం విశేషం. 

సమ్మేళనంలో పాల్గొన్న విజయరామారావు, పెద్దిరెడ్డి, మురళీధర్‌రావు, లక్ష్మణ్, చింతల తదితరులు

తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి: బీవీఆర్‌ మోహన్‌రెడ్డి 
విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు నిజాయితీ, క్షమాగుణం ఇలా అన్ని తన తల్లి వద్దే నేర్చుకున్నానని ప్రముఖ వ్యాపారవేత్త బీవీఆర్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విలువలు మాత్రమే మనిషిని విజయపథం వైపు నడిపిస్తాయని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదర్శంగా నిలవాలని, ఏది మంచో, ఏది చెడో తెలపాలని సూచించారు. మన ప్రవర్తనే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి నిత్యం ఏదో ఒకటి చదవాలని, పరిస్థితిని బట్టి, అర్థం చేసుకుని, అందుకనుగుణంగా నడుచుకుం టేనే విజయం సిద్ధిస్తుందని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రపంచంలోనే పెద్ద ఎన్జీవో అని, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు దేశ ప్రజల ఐక్యతను పెంపొందిస్తోందని పేర్కొన్నారు.  

సంఘ్‌సేవకులతో భాగవత్‌..
ఇబ్రహీంపట్నం రూరల్‌: సమాజం సంఘటితానికి సంఘ్‌ కార్యకర్తలు పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ స్వయం సేవకులకు సూచించారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్‌పల్లి భారత్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో మంగళవారం ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ శిబిరం బుధవారం మధ్యాహ్నం వరకు జరిగింది. మంగళవారం రాత్రి శిబిరానికి చేరుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భారత్‌ కాలేజీలోనే బస చేశారు. ఉదయం 4 గంటలకు సాధారణ కార్యకర్తలతో పాటే కరసేవ చేశారు. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు శిబిరంలో 2 వేల మంది కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

10 గంటల నుంచి 11.30 గంటల వరకు యాదాద్రి శిబిరంలో మరో 2 వేల మంది సంఘ్‌ సేవకులతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సాధారణ కార్యకర్తలతో భాగ్యలక్ష్మినగర్‌ శిబిరంలో భోజనం చేశారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలోని సభకు మంగళ్‌పల్లి శిబిరం నుంచి 196 బస్సుల్లో కార్యకర్తలు తరలిపోయారు. భారత్‌ కళాశాల నుంచి మోహన్‌ భాగవత్‌ 2.45 గంటలకు బయల్దేరారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు, బ్లాక్‌ క్యాట్‌ కమాండోలతో పటిష్టమైన బందోబస్తు మధ్య సరూర్‌నగర్‌ స్టేడియానికి వెళ్లారు.

కదం కదం కదుపుతూ.. స్వయం సేవకుల భారీ కవాతు..
సాక్షి, హైదరాబాద్‌/మీర్‌పేట: తెలుపు.. ఖాకీ రంగు దుస్తులు.. చేతిలో లాఠీలతో స్వయం సేవకులు భారీ కవాతు నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, కిసాన్‌ సంఘ్, ఏబీవీపీలకు చెందిన 7705 మంది స్వయం సేవకులు హస్తినాపూర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, ఇబ్ర ïహీంపట్నం ప్రధాన రహదారులపై కవాతు నిర్వహిస్తూ సాయంత్రం 4 గంటలకు ఎల్బీనగర్‌ చేరుకున్నారు. అటు నుంచి 5 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. ఈ సభకు తెలం గాణ జిల్లాల నుంచి స్వయం సేవకులతో పాటు పార్టీ కార్యకర్తలు భారీగా హాజరుకావడంతో సభాస్థలి కిక్కిరిసిపోయింది. స్వయం సేవకులు ప్రదర్శించిన దండవ్యాయామం, వీరవజ్రాసనం, ఉపనిష్ట వ్యాయామాలు సభలో హైలెట్‌గా నిలిచాయి. వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద, ఝాన్సీలక్ష్మీభాయ్, బీఆర్‌ అంబేడ్కర్‌ల భారీ కటౌట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మరిన్ని వార్తలు