విమానానికి తప్పిన ముప్పు

19 Sep, 2018 01:49 IST|Sakshi

న్యూఢిల్లీ: 370 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పలు నియంత్రణ పరికరాలు విఫలమవడం, ఇంధన నిల్వలు అయిపోవడంతో పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి న్యూజెర్సీలో విమానాన్ని సురక్షితంగా నేలకు దించారు. సెప్టెంబర్‌ 11న ఈ ఘటన జరగ్గా, అత్యవసర సమయంలో పైలట్లు, అమెరికా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ మధ్య జరిగిన సంభాషణల క్లిప్పింగ్‌ తాజాగా బహిర్గతమైంది.

’నియంత్రణ పరికరాలు పనిచేయడం లేదు. ఇంధనం కూడా తగినంతగా లేదు’ అని పైలట్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు చెప్పగా..‘క్షణంలో మీకు బదులిస్తాం’ అని అటువైపు నుంచి సమాధానం వచ్చింది. ‘మా వద్ద సింగిల్‌ క్రాస్‌ రేడియో అల్టీమీటర్‌ ఉంది. టీసీఎస్‌ వ్యవస్థ, ఆటో ల్యాండ్, వైండ్‌షీర్‌ వ్యవస్థ, ఆటోస్పీడ్‌ బ్రేక్, ఏపీయూ(ఆగ్జిలరీ పవర్‌ యూనిట్‌)లు పనిచేయడం లేదు’ అని పైలట్‌ అంటున్నట్లు ఆడియోలో వినిపించింది.

విమానాన్ని ల్యాండ్‌ చేయడానికి ముందు పైలట్లు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ పలు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించినట్లు వారి సంభాషణల ద్వారా తెలుస్తోంది. ఊహించని సాంకేతిక సమస్య తలెత్తినా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌చేసిన సిబ్బందిని ఎయిరిండియా ప్రశంసించింది.

మరిన్ని వార్తలు