రాజకీయ పొత్తులు ముఖ్యం కాదు

11 Mar, 2015 04:52 IST|Sakshi
రాజకీయ పొత్తులు ముఖ్యం కాదు

దేశ రక్షణే ప్రధానం: హోంమంత్రి రాజ్‌నాథ్
ఆలం వివాదంలోకి గవర్నర్‌ను లాగిన కశ్మీర్ హోంశాఖ

 
ఘజియాబాద్/జమ్మూ: దేశరక్షణ తమ ప్రభుత్వ అతి ప్రాధాన్య అంశమని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో పొత్తు దేశ రక్షణ కంటే ముఖ్యం కానే కాదన్నారు. వేర్పాటువాది మసరత్ ఆలం విడుదలపై వివాదం రేగిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజ్‌నాథ్ మంగళవారం ఘజియాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కాగా, కశ్మీర్ సీఎం సయీద్.. రాజ్‌నాథ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇకపై సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తామని, బీజేపీని సంప్రదించకుండా ఏ వేర్పాటువాదినీ విడిచిపెట్టబోమని ఆయన అన్నట్లు సమాచారం.

ఆలంను మళ్లీ అరెస్ట్ చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. మరోవైపు ఆలం విడుదలపై పార్లమెంటులో రెండో రోజు కూడా విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. సయీద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. సయీద్ ప్రభుత్వం మరో 800 మంది వేర్పాటువాదులను విడుదల చేయాలనుకుంటోందని ఆ రాష్ట్ర గవర్నర్ నివేదిక పంపించారన్న వార్తలపై కేంద్రం జవాబివ్వాలంటూ రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా, ఆలం విడుదలకు సంబంధించి కశ్మీర్ హోం శాఖ జమ్మూ కలెక్టర్‌సకు రాసిన లేఖ వివాదానికి తెరలేపింది. ఆలం విడుదల ఉత్తర్వులు గవర్నర్ పాలన ఉన్న ఫిబ్రవరిలోనే వెలువడినట్లు ఈ లేఖ స్పష్టం చేస్తోంది. దీంతో ఈ వివాదంలోకి కొత్తగా గవర్నర్ ఎన్‌ఎన్ వోరా చిక్కుకున్నారు.
 
 

మరిన్ని వార్తలు