ఆర్మీలో అన్యాయం.. సుప్రీంకు అధికారులు

11 Sep, 2017 14:34 IST|Sakshi
ఆర్మీలో అన్యాయం.. సుప్రీంకు అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ ఆర్మీలో తమకు అన్యాయం జరుగుతోందంటూ వంద మందికి పైగా లెఫ్టినెంట్‌ కల్నల్, మేజర్‌ ర్యాంకు స్థాయి అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వీస్‌ కార్ప్స్‌లోని ఉద్యోగుల ప్రమోషన్లలో వివక్ష చూపడంతో తగిన అర్హత ఉన్నా తాము కింది స్థాయికే పరిమితం అవుతున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలాంటి దుస్థితి కలగటం ఆర్మీ ఉద్యోగులపైనే కాక దేశ రక్షణపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పారు.

లెఫ్టినెంట్‌ కల్నల్‌, మేజర్‌ ర్యాంకు స్థాయి ఉద్యోగులు అన్యాయం జరుగుతోందని సుప్రీం కోర్టుకు వెళ్లడం కొత్తగా రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్‌కు సవాలుగా మారనుంది. ప్రమోషన్లు ఇవ్వకపోతే తమను ఆపరేషనల్‌ ఏరియాల్లో ఆయుధాలు ఇచ్చి విధులకు పంపకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును పిటిషనర్లు అభ్యర్థించారు.

కంబాట్‌ ఆర్మ్స్‌ కార్ప్స్‌ అధికారుల్లానే సర్వీస్‌ కార్ప్స్‌ ఉద్యోగులను కూడా కల్లోల ప్రాంతాల్లో విధులు నిర్వహించాలని ఆర్మీ కోరుతున్నప్పుడు.. ప్రమోషన్ల విషయంలో మాత్రం వివక్ష ఎందుకు చూపాలని పిటిషనర్లలో ఒకరైన లెఫ్టినెంట్‌ కల్నల్‌ పీకే చౌదరి ప్రశ్నించారు. భారతీయ ఆర్మీలో గల మిగిలిన కార్ప్స్‌ను ఆపరేషనల్‌గా పరిగణిస్తూ.. కేవలం సర్వీస్‌ కార్ప్స్‌ను నాన్‌ ఆపరేషనల్‌గా చూస్తూ 'ఆపరేషనల్‌' పనులకు వినియోగించడం సరికాదని అన్నారు.

సర్వీస్‌ కార్ప్స్‌ను కూడా ఆర్మీలోని మిగిలిన విభాగాల్లా ఆపరేషనల్‌గా గుర్తించి, ప్రమోషన్లలో వివక్ష లేకుండా చూసేలా ప్రభుత్వాన్ని, భారతీయ ఆర్మీని ఆదేశించాలని పిటిషన్‌లో అధికారులు కోరారు.

మరిన్ని వార్తలు