సీఏఏ : మరో కీలక పరిణామం

21 Dec, 2019 14:43 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

1000 మంది మేధావుల మద్దతు

సీఏఏకు మద్దతుగా బహిరంగ లేఖ 

సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్ట వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. విద్యార్థిలోకం సాహిత్య కారులు, పలువురు మేధావులు ఈ చట్టం ఆటవిక చట్టమని విమర్శిస్తుండగా, మద్దతుగా మరికొంతమంది మేధావులు ముందుకు రావడం విశేషం.  దాదాపు 1100 మంది  ప్రముఖులు, మేధావులు బహిరంగ లేఖ రాశారు. ప్రముఖ విద్యావేత్తలు, సాహిత్య కారులు సహా, దేశంలోని వివిధ యూనివర్శిటీలకు  చెందిన ఉన్నతాధికారులు, పలువురు సీనియర్లు దీనిపై సంతకాలు చేశారు. ఈ విషయంలో ప్రజలు తప్పుడు  ప్రచారానికి పూనుకోవద్దని విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చిన పార్లమెంటును అభినందించారు.

మరోవైపు వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో పరిస్థితిని అంచనావేసేందుకు, భద్రతపై చర్చించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం  మంత్రులతో సమావేశమయ్యారని  పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

కాగా సీఏబీ  ప్రతిపాదన మొదలు ఈశాన్య రాష్ట్రమైన అసోం సహా దేశంలోని పలు ప్రాంతాల్లో అందోళనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టం అమానవీయమైందనీ, ముస్లింలపై వివక్ష చూపుతుందని, దేశ లౌకిక రాజ్యాంగాన్ని బలహీనపరుస్తుందని విమర్శకులు భావిస్తున్నారు. ఈ చట్టాన్ని కేంద్రం  తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారం పార్లమెంటు చట్టాన్ని ఆమోదించినప్పటి నుండి పోలీసులు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల్లో కనీసం 14 మంది మరణించారు.

మరిన్ని వార్తలు