మావో పార్టీలో పునర్వ్యవస్థీకరణ

18 Dec, 2017 02:15 IST|Sakshi

వృద్ధ నేతలకు వేరే విధులు

పార్టీ కేంద్ర కమిటీ సర్క్యులర్‌

కోల్‌కతా: నిషేధిత సీపీఐ–మావోయిస్టు పార్టీలో పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా వృద్ధ నేతలకు విరామం ఇచ్చి, వారి సేవలను ఇతర రంగాల్లో వినియోగించుకుంటోంది. ఈ ఏడాది ఆరంభంలో పార్టీ కేంద్ర నాయకత్వం సమావేశమై ఈ దిశగా చర్యలను ప్రారంభించింది. ఈ వివరాలున్న మూడు పేజీల సర్క్యులర్‌ను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ వివిధ అనుబంధ విభాగాలకు అందజేసింది. ఉద్యమ అవసరాల రీత్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అందులో పేర్కొంది. భద్రతా బలగాలు, పోలీసులు జల్లెడ పడుతున్న ప్రాంతాల్లో చురుగ్గా వ్యవహరించలేని అజ్ఞాతంలో ఉన్న సీనియర్‌ నేతలను రక్షించుకోవటం కూడా కీలకమని అందులో పేర్కొంది. పార్టీ నిర్దేశించిన విధులను సరిగ్గా నిర్వహించలేని వృద్ధ నేతలను, శారీరకంగా చురుగ్గా లేని వారిని గుర్తించాలని ఆ సర్క్యులర్‌లో కోరింది.

వారిని బాధ్యతల నుంచి తప్పించి పార్టీ అనుబంధ సంఘాల ఏర్పాటు, ఇతర ప్రాంతాల్లో ఉద్యమ నిర్మాణం బాధ్యతలను అప్పగించాలని సూచించింది. అయితే, ఇందుకు వయో పరిమితిని మాత్రం నిర్దేశించలేదు. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావుకు 67 ఏళ్లు, తూర్పు ప్రాంత బ్యూరో ప్రశాంత్‌ బోస్‌ అలియాస్‌ కిషన్‌ దా వయస్సు 72 ఏళ్లు, కేంద్ర మిలటరీ కమిషన్‌ చీఫ్‌ వాసవరాజ్‌కు 62 ఏళ్లు కావటం గమనార్హం. అయితే, ఇలాంటి ప్రక్షాళన మావోయిస్టు పార్టీకి కొత్తేమీ కాదని పశ్చిమబెంగాల్‌ సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. గతంలో 1960–70లలో కూడా ఇలాంటివి జరగాయని తెలిపారు. అప్పట్లో సీనియర్‌ నేతల సేవలను ఉద్యమ సమావేశాలు వంటివి నిర్వహించటానికి వినియోగించుకున్నారన్నారు.

మరిన్ని వార్తలు