ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌లు సగం మనకే 

22 Jul, 2020 03:51 IST|Sakshi

సీరమ్‌ సీఈవో అదార్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత ప్రజానీకానికి భారీ ఊరటనిచ్చే వార్త ఇది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ పరీక్షలు విజయవంతమయ్యాయని లాన్సెట్‌ జర్నల్‌ ప్రచురించిన నేపథ్యంలో తమ సంస్థ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్‌ డోసుల్లో 50శాతం భారత్‌కు అందిస్తామని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదార్‌ పూనావాలా వెల్లడించారు. మంగళవారం ఆయన ఒక జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ వ్యాక్సిన్‌ డోసుల్లో సగం భారత్‌లో పంపిణీ చేసి, మిగిలినవి ఇతర దేశాలకు సరఫరా చేస్తామన్నారు.  

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో భాగస్వామిగా.. 
వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ అన్నీ సాఫీగా సాగి ఫలితాలు సానుకూలంగా వస్తే టీకాల తయారీలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సీటీతో భాగస్వామిగా ఉంటామని అదార్‌ చెప్పారు. పుణే కేంద్రంగా పనిచేసే సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సిన్‌ మూడో దశ మానవ ప్రయోగాల అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, అనుమతులు రాగానే ఆగస్టులో ప్రయోగాలు చేస్తామన్నారు. ఆ ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తే భారీగా వ్యాక్సిన్‌ డోసుల్ని తయారు చేస్తామని తెలిపారు.  

ప్రతీ నెల ఉత్పత్తి చేసే డోసుల్లో సగం మనకే 
ఒకసారి టీకా ఉత్పత్తి ప్రారంభం కాగానే ప్రతీ నెల మార్కెట్‌కి విడుదల చేసే టీకా డోసుల్లో సగం భారత్‌లో సరఫరా చేసి మిగిలిన సగం ఇతర దేశాలకు పంపిస్తామన్నారు. భారత్‌ ప్రజలతో పాటుగా ప్రపంచ ప్రజల రోగనిరోధక వ్యవస్థ ముఖ్యమేనని చెప్పారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాది చివరిలోగా కొన్ని లక్షల వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి జరుగుతుందని, వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లో 30 నుంచి 40 కోట్ల టీకా డోసుల్ని తయారు చేసే సామర్థ్యం తమ సంస్థకు ఉందని అదార్‌ వెల్లడించారు. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది జూన్‌కల్లా వ్యాక్సిన్‌ను ఆవిష్కరిస్తామని ఆయన చెప్పారు.

టీకా ధర రూ. వెయ్యి: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ధర వెయ్యి రూపాయలు, అంతకంటే తక్కువే ఉంటుందని అదార్‌ వెల్లడించారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో తాము లాభాపేక్ష కోసం చూడమని చెప్పారు. అయితే ప్రజలెవరూ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునన్నారు. సర్వసాధారణంగా ప్రభుత్వాలే వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి ఇమ్యునైజేషన్‌ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తాయని స్పష్టం చేశారు. ఆఫ్రికా వంటి నిరుపేద దేశాలకు 2 నుంచి 3 డాలర్లకే (రూ.150 నుంచి రూ. 225) పంపిణీ చేస్తామని అదార్‌ వివరించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికే తొలి దశలో వ్యాక్సిన్‌ ఇవ్వడం నైతిక ధర్మమని చెప్పారు. అయితే తొలుత ఎవరికి ఇవ్వాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని అదార్‌ వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు