నాడు మంత్రి హోదాలో.. నేడు విచారణ కోసం

22 Aug, 2019 13:09 IST|Sakshi

న్యూఢిల్లీ: విధి బలీయమైంది అనే సామెత మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఒకప్పుడు కేంద్ర మంత్రిగా తాను ప్రారంభించిన భవనంలోనే నేడు విచారణ ఎదుర్కొంటున్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరాన్ని సీబీఐ అధికారులు బుధవారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనను ఢిల్లీలోని సీబీఐ నూతన ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. ఈ భవనానికి ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో చిదంబరం ఈ భవన ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో కలిసి హాజరయ్యారు. నేడు అదే భవనంలో చిదంబరాన్ని విచారిస్తుండటం గమనార్హం.

ప్రస్తుతం చిదంబరాన్ని భవనంలోని గెస్ట్‌ హౌస్ అంతస్తులోని లాక్-అప్ సూట్ 3లో ఉంచారు. విచారణలో భాగంగా ఇప్పటికే మొదటి రౌండ్‌ పూర్తయింది. రెండో రౌండ్‌ కూడా మొదలైంది. ఇందులో ముఖ్యంగా ఇంద్రాణి ముఖర్జీ పాత్రపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. కోర్టులో విచారణ పూర్తయిన అనంతరం చిదంబరం రిమాండ్‌కు సీబీఐ విజ్ఞప్తి చేయనుంది. గరిష్టంగా 14 రోజుల రిమాండ్‌కు కోరనున్నట్లు సమాచారం. (చదవండి: ఇదీ.. చిదంబరం చిట్టా)

>
మరిన్ని వార్తలు