చిదంబరం సీబీఐ కస్టడీ మరో 4 రోజులు

27 Aug, 2019 03:58 IST|Sakshi

ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు

ఈడీ అరెస్టు నుంచి 27 వరకు రక్షణ పొడిగించిన సుప్రీం

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను మరో నాలుగు రోజులపాటు విచారించేందుకు ఢిల్లీ స్పెషల్‌ కోర్టు సీబీఐకి అనుమతించింది. చిదంబరం నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీని మరో 5రోజులపాటు పొడిగించాలంటూ సీబీఐ విజ్ఞప్తి చేసింది. సీబీఐ వినతి న్యాయబద్ధంగా ఉందన్న స్పెషల్‌ జడ్జి అజయ్‌ కుమార్‌ ఈ 30వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు, ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీ ల్యాండరింగ్‌ కేసులో చిదంబరంను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణను సుప్రీంకోర్టు మంగళవారం వరకు పొడిగించింది. ఇదే కేసులో తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించటాన్ని సవాల్‌ చేస్తూ చిదంబరం వేసిన పిటిషన్‌పై వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అప్పటికే(ఆగస్టు 21) చిదంబరం అరెస్టయినందున దీనిపై విచారణ నిష్ప్రయోజనమని వ్యాఖ్యానించింది.

అయితే, ఈ కేసులో చట్టబద్ధమైన పరిష్కారం కోరే స్వేచ్ఛ ఆయనకు ఉందని పేర్కొంది. దీంతో ఈడీ కౌంటర్‌ అఫిడవిట్‌కు సమాధానం(రీజాయిండర్‌) ఇస్తామని చిదంబరం తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ తెలిపారు. నిష్పాక్షిక విచారణ, దర్యాప్తు అనేవి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21లో అంతర్భాగమని, చిదంబరం ప్రాథమిక హక్కులను న్యాయస్థానం కాపాడాలని పేర్కొన్నారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగించేందుకు ధర్మాసనం అంగీకరించింది.

మరిన్ని వార్తలు