ఆర్థిక ప్యాకేజీ: చిదంబరం స్పందన

13 May, 2020 10:45 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకుడు పి. చిదంబరం దీనిపై బుధవారం స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న ప్రధాని నరేంద్ర మోదీ కేవలం హెడ్‌లైన్‌ చెప్పి ఖాళీ పేపర్‌ను వదిలేశారు. అందుకే నిన్న నా స్పందన కూడా బ్లాంక్‌గానే ఉంది. నేడు ఆర్థిక మంత్రి ఆ కాగితాన్ని పూరిస్తారు. కేంద్రం ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టే ప్రతి ఒక్క రూపాయిని మేం చాలా జాగ్రత్తగా లెక్కిస్తాం. ఎవరికి ఏం దక్కబోతుందో నేడు తెలుస్తుంది. పేదలు, మరి ముఖ్యంగా ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి సొంత ఊళ్లకు చేరుకున్న వలస కార్మికులకు మోదీ ప్రభుత్వం ఏం ఇవ్వబోతుందో తెలుసుకునేందుకు మేం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం’ అంటూ చిదంబరం ట్వీట్‌ చేశారు.
 

కరోనాతో కునారిల్లిన ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుతం ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పథకానికి రూపకల్పన చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలను ఆదుకునే  ప్రణాళికతో రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. భారీ, మధ్య తరహా, చిన్నతరహా పరిశ్రమలవారు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, కూలీలు.. వ్యవస్థలోని అందరినీ ఆదుకునేలా రూపొందించిన ఈ భారీ ప్రత్యేక ప్యాకేజీ దేశ జీడీపీలో దాదాపు 10% అని ప్రధాని వెల్లడించారు.
(చదవండి: నిందలు సరే నిర్ధారణ ఎలా)

మరిన్ని వార్తలు