ఆ భూములను వాడుకునే వీలు కల్పించండి

21 Dec, 2017 04:32 IST|Sakshi

రక్షణ, రైల్వే శాఖ భూములపై కేంద్రాన్ని కోరిన జితేందర్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రక్షణశాఖ, రైల్వేశాఖ అధీనంలోని భూములు చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని ప్రజావసరాలకు వినియోగించుకునేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. బుధవారం లోక్‌సభలో ‘అవసరార్థం స్థిరాస్తి సేకరణ చట్ట సవరణ’ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల రక్షణశాఖకు చెందిన బైసన్‌పోలో మైదానాన్ని తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి ఇచ్చేందుకు ఆ శాఖ అంగీకరించింది. రక్షణ అవసరాల కోసం హైదరాబాద్‌లో రక్షణశాఖకు భూములిస్తే.. ఆ శాఖ స్థానికంగా ఉండే ప్రజలను ఇబ్బందిపెట్టేలా నిబంధనలు పెడుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి వేధింపులు మానుకోవాలి. జాతీయ భద్రత గురించి భూములు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకొని చర్చలు జరపాలి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భూములు బదిలీ చేసుకోవాలి గానీ వెల కట్టడం సరికాదు’ అని అన్నారు. 

నాడు ‘కల్యాణలక్ష్మి’ ఉండుంటే..: కడియం
తొర్రూరు రూరల్‌ (పాలకుర్తి):
‘నాకు ఆరుగురు అక్కాచెల్లెళ్లు.. పేదలైన మా తల్లిదండ్రులు బిడ్డల పెళ్లిళ్లు చేసేందుకు నానా కష్టాలు పడ్డారు.. ఇప్పటిలా కల్యాణలక్ష్మి ఉంటే మాకు ఆ ఇబ్బందులు ఉండేవి కావు’ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నాటి కష్టాలను గుర్తుచేసుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా చెర్లపాలెం గ్రామంలో బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ తనకు ముగ్గురు ఆడపిల్లలేనని, ఒక్క కొడుకైనా కలగకపాయేనని కన్నతల్లి ఆవేదన చెందేదని, కానీ.. కూతుళ్లను ఉన్నతంగా చదివించి ఉత్తములుగా తీర్చిదిద్దానని చెప్పారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లిది.. తనది ఒకే గ్రామమని.. ఉన్నత కుటుంబం నుంచి ఎర్రబెల్లి, పేద కుటుంబం నుంచి తాను అభివృద్ధి చెందామని అన్నారు.

మరిన్ని వార్తలు