వైరస్‌పై ప్రధాని సమీక్ష

8 Mar, 2020 04:33 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌(కోవిడ్‌–19) బారిన పడిన వారిని ఏకాంతంగా ఉంచేందుకు తగిన ప్రాంతాలను గుర్తించడంతోపాటు, వ్యాధి మరింత తీవ్రతరమైతే అన్ని అత్యవసర సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మోదీ అధికారులను ఆదేశించారు. దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై శనివారం ప్రధాని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, ప్రజలు పెద్ద ఎత్తున ఒకచోట గుమికూడే పరిస్థితులను నివారించాలని అధికారులకు సూచించారు. ‘అన్ని విభాగాల వారూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలి. అవగాహన పెంచే ప్రయత్నాలు చేపట్టాలి. ముందు జాగ్రత్త చర్యలనూ వివరించాలి’ అని ప్రధాని కోరినట్లు అధికారిక ప్రకటన ఒకటి తెలిపింది. కోవిడ్‌ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తున్న పద్ధతుల్లో మేలైనవి ఎంచుకుని అమలు చేయా లని ప్రధాని కోరారని ప్రకటనలో పేర్కొన్నారు.

వైరస్‌ టెస్టింగ్‌కు 52 కేంద్రాలు
కరోనా వైరస్‌ పరీక్షలు జరిపేందుకు దేశవ్యాప్తంగా 52 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రక్త నమూనాల సేకరణ విషయంలో సహకరించేందుకు మరో 57 పరిశోధనశాలలను గుర్తించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో ఇప్పటివరకూ 34 మంది కోవిడ్‌ బారిన పడినట్లు నిర్ధారణ కాగా, వీరిలో 16 మంది ఇటలీ పర్యాటకులు ఉన్న విషయం తెలిసిందే. మరో 29 వేల మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని స్విమ్స్, విశాఖలోని ఆంధ్ర మెడికల్‌ కాలేజీ, అనంతపురములోని జీఎంసీలు ఉన్నాయి. అలాగే బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, మైసూర్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, హాసన్, శివమొగ్గ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లలో పరీక్షలు జరుగుతాయి.  

కాలర్‌ టోన్లతో కరోనా వైరస్‌ అవగాహన
పలు టెలికం సర్వీసుల్లో రింగ్‌టోన్లకు బదులు  వైరస్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలుకొని జబ్బు లక్షణాలను వివరించే కాలర్‌ టోన్లు వినిపిస్తున్నాయి. కేంద్రం టెలికం ఆపరేటర్లకు ఈ ఆడియో క్లిప్‌ను అందించగా వాటిని తాము కాలర్‌ ట్యూన్ల కోసం డబ్బు చెల్లించే వారికి మినహా మిగిలిన వారందరికీ అందిస్తున్నట్లు ఒక టెలికం ఆపరేటర్‌ తెలిపారు. కరోనా వైరస్‌పై యుద్ధంలో కార్పొరేట్‌ సంస్థలు రంగంలోకి దిగాయి. పేటీఎం, ట్విట్టర్‌ వంటి కంపెనీలు ఉద్యోగులను ఇంట్లో నుంచే పనిచేయాలని ఆప్పటికే ఆదేశాలు జారీ చేయగా, రిలయన్స్‌ జియో తమ ఆఫీసుల్లో అటెండెన్స్‌కు వాడే బయోమెట్రిక్‌ యంత్రాలను పక్కనబెట్టింది. ఓలా తమ డ్రైవర్లకు మాస్కులు, శానిటైజర్లను అందించడం మొదలుపెట్టింది.

భారత్‌లో మరో మూడు
దేశంలో మరో ముగ్గురు కోవిడ్‌– 19 బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌– 19 బారిన పడిన వీరిలో ఇద్దరు లడాఖ్‌కు చెందిన వారు కాగా.. ఇటీవలే ఇరాన్‌కు వెళ్లారని, మిగిలిన ఒక వ్యక్తి తమిళనాడుకు చెందిన వారని ఒమన్‌ను సందర్శించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనలో వివరించారు. దీంతో భారత్‌లో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 34కు చేరుకున్నట్లు అయింది. తాజాగా కోవిడ్‌ వైరస్‌ బారిన పడ్డ ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది.

>
మరిన్ని వార్తలు