‘ఆ భయంతోనే విరుచుకుపడ్డారు’

25 Apr, 2017 12:13 IST|Sakshi
‘ఆ భయంతోనే విరుచుకుపడ్డారు’

న్యూఢిల్లీ: తమ భవిష్యత్‌ ఏమవుతుందనే భయంతోనే మావోయిస్టులు దాడికి పాల్పడినట్లు సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు అంటున్నారు. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే సుకుమా జిల్లాలో ప్రస్తుతం పలు చోట్ల రోడ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయని, అవే పూర్తయితే పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలకు సంబంధించినవి వస్తాయని, అదే జరిగితే తమ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందనే ఆందోళనతోనే మావోయిస్టులు ఈ దారుణానికి ఒడిగట్టారని అంటున్నారు.

దక్షిణ బస్తర్ ప్రాంతంలోని కాలాపత్తర్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు భీకర దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో గిరిజన ప్రాంతాలకు రవాణా సదుపాయం కల్పించేందుకు రోడ్లు వేస్తున్న బృందానికి రక్షణగా వచ్చిన సీఆర్పీఎఫ్ 74వ బెటాలియన్‌లో 25 మంది బలైపోయారు. ఈ నేపథ్యంలో దాడిపై సీఆర్‌పీఎఫ్‌ అధికారులు కొంత విశ్లేషణ చేశారు. బుర్కాపాల్‌ క్యాంప్‌ నుంచి చింతగుఫా వైపు వెళుతున్న సీఆర్‌పీఎఫ్‌ బృందంపై దాడి జరిగే అవకాశం ఉందని వారికి కొంత సమాచారం ముందుగానే అందిదంట. అయితే, ఇంత త్వరగా జరుగుతుందని అంచనా వేయలేకపోయినట్లు చెబుతున్నారు.

మావోయిస్టుల దాడులపై గతంలో సీనియర్‌ సలహాదారుగా వ్యవహరించిన కే విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ సుకుమా అనే ప్రాంతం మూడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు జంక్షన్‌ లాంటిదని, ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే అత్యధిక రహదారులు నిర్మించడాన్ని వారు తమకు ప్రధాన శత్రుత్వంగా భావిస్తున్నారని చెప్పారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు దగ్గరుండి మరీ రోడ్లు వేయిస్తున్నందున వారే ప్రతిసారి బలవుతున్నారని చెప్పారు.

>
మరిన్ని వార్తలు