కర్ణిసేన అంత పవర్ ఫుల్లా?

26 Jan, 2018 19:57 IST|Sakshi

షాహిద్‌ కపూర్‌, రణ్ బీర్‌ సింగ్‌, దీపికా పదుకొనే నటించిన సినిమా పద్మావత్‌ ఎంత వివాదాస్పదమైందో, దాన్ని నిషేధించాలని కోరిన కర్ణిసేన  అంతకంటే ఎక్కువ పాపులర్ అయింది.  శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేన అన్నది  ఇప్పటికిప్పుడు ఏర్పడిన సంస్థ కాదు. దానికి చాలా చరిత్రే ఉంది.  సరిగ్గా సంవత్సరం క్రితం జనవరి 27న  జైపూర్‌లో పద్మావతి షూటింగ్ సందర్భంగా చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీపై దాడికి దిగి బీభత్సం సృష్టించింది ఈ కర్ణిసేనే. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కడమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ శక్తిమంతమైన సంస్థగా ఎదిగింది కర్ణిసేన.

పద్మావత్‌ సినిమా వివాదం పుణ్యమా అని ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండే వివిధ రాజపుత్ర సంఘాలన్నింటినీ ఇప్పుడు కర్ణిసేన అనడం పరిపాటైంది.  వీటిన్నింటిలోనూ అతి పాతది శ్రీరాజ్‌పుత్‌ కర్ణిసేన. దీన్ని 2006లో స్థాపించారు. రాజకీయాల్లో విజయం సాధించలేకపోయిన లోకేంద్ర సింగ్‌ కాల్వి, బిల్డర్ అజిత్ సింగ్ మామ్డోలి ఈ సంస్థను స్థాపించింది తామేనని చెప్పుకుంటారు.  సంస్థను ఏర్పాటు చేసిన కొన్ని నెలల తర్వాత తాను కాల్విని చేరాలని కోరానని అజిత్ సింగ్ చెప్తారు.  కాని తాను కూడా సహ వ్యవస్థాపకుడినని కాల్వి వాదిస్తుంటారు.  2008 రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరు విడిపోయారు.  ఇప్పటికీ ఇద్దరూ శ్రీరాజ్‌ పుత్‌ కర్ణిసేన పేరుతో సమాంతర సంస్థలను నడుపుతున్నారు.  పేరు విషయంలో ఇద్దరి మధ్య కోర్టు కేసు కూడా నడుస్తోంది. ఈ సంస్థలో 7.64 లక్షల మంది సభ్యులున్నారని కాల్వి అంటారు. అజిత్ సింగ్ మాత్రం తమ సభ్యుల సంఖ్య 2.62 లక్షలని చెప్తారు.

ఇంతకీ లోకేంద్ర సింగ్ కాల్వి ఎవరు?
పద్మావత్ సినిమాపై నిరసనలు మిన్నంటిన వేళ టీవీల్లో ఎక్కువ కనిపిస్తున్న వ్యక్తి లోకేంద్ర సింగ్ కాల్వి. ఆరడుగుల అజానుబాహుడైన ఆయన  సినిమాను నిషేధించాలని కోరుతూ  రాజ్‌పుత్‌లను ఏకం చేసేందుకు  గడిచిన కొన్ని నెలలుగా ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా కార్యాలయమంటూ ఏమి లేదు. జైపూర్‌లోని ఆయన ఇల్లు లేదా మరో రాజ్‌పుత్‌ సంఘం శ్రీ రాజ్‌ పుత్‌ సభా కార్యాలయం  నుంచి ఆయన తన కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు.

మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ మంత్రివర్గంలో పనిచేసిన కళ్యాణ్ సింగ్ కాల్వి కుమారుడు లోకేంద్ర సింగ్.  1993 లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా, 1998 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి  రెండుసార్లు కూడా లోకేంద్ర సింగ్  ఓటమిపాలయ్యారు. 1999లో బీజేపీని వీడి, మరో బీజేపీ మాజీ నేత దేవీ సింగ్ భాటీతో కలిసి రాజ్‌పుత్‌లు సహ అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సోషల్ జస్టిస్‌ ఫ్రంట్ అనే సంస్థను స్థాపించి  ఉద్యమం నిర్వహించారు. అంతే కాదు దాన్ని విస్తృతపరిచి రాజస్థాన్ సామాజిక్ న్యాయ్ మంచ్‌ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి 2003లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 65 మంది అభ్యర్థులను నిలిపారు.  ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కాల్వి, భాటి ఆ తర్వాత తిరిగి బీజేపీలోకి వచ్చారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించి కాల్వి విఫలయ్యారు.

2015లో శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేన రాజస్థాన్‌ శాఖ అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడిని కాల్వి బహిష్కరించారు. దీంతో ఆయన  శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన పేరుతో సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇవే కాదు పద్మావత్‌ సినిమాను వ్యతిరేకించే రాజ్‌పుత్‌ సంస్థలు ఉత్తరాదిన అనేకం ఉన్నాయి. ప్రత్యేకంగా మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా మటుకు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసే సంస్థలే.

సంస్థ ఎవరిదనే విషయంలో విభేదాలున్నప్పటికీ చిరకాల ప్రత్యర్థులు జాట్లను ఎదుర్కొనేందుకే శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేనను ఏర్పాటు చేశామని లోకేంద్ర సింగ్‌, అజిత్ కుమార్ అంగీకరిస్తారు.  2006లో రావణ రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్‌ సింగ్ తన అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డుతగులుతున్నారనే కారణంతో ఇద్దరు జాట్లను హత్య చేశాడు. దీనిపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన జాట్లకు అన్ని రాజకీయపక్షాల నుంచి  మద్దతు లభించింది. దీంతో ఆనంద్‌పాల్‌ అనుచరులుగా భావించిన రాజ్‌పుత్‌లందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వేధింపులను అడ్డుకునేందుకు 11 లక్ష్యాలతో సెప్టెంబర్‌ 23, 2006న శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన ఏర్పాటైంది. రాజపుత్రల్లో ఐకమత్యాన్ని ప్రోత్సహించడం, రాజపుత్రులకు వ్యతిరేకంగా జరిగే సామాజిక, రాజకీయ దుష్ప్రచారాన్ని అడ్డుకోవడం, చరిత్ర, చారిత్రక సంఘటనలను తప్పుగా చూపడాన్ని వ్యతిరేకించడం వంటివి ఆ 11 లక్ష్యాల్లో కొన్ని.  రాజస్థానీయులందరూ ఆరాధించే కర్ణిమాత పేరును సంస్థకు పెట్టారు.

చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ 2008లో అశుతోష్ గోవారికర్ నిర్మించిన జోధా అక్బర్‌ సినిమాను కూడా కర్ణిసేన వ్యతిరేకించింది. ఆ చిత్రాన్ని రాజస్థాన్‌ ప్రభుత్వం నిషేధించనప్పటికీ అది అక్కడ విడుదల కాలేదు.  బ్రాహ్మణులను రక్షించడం క్షత్రియుల కర్తవ్యమంటూ బ్రాహ్మణులపై లాఠీ ఛార్జ్‌ను నిరసిస్తూ 2008లో కర్ణిసేన జైపూర్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ వైఖరిని తప్పుబడుతూ 2013లో జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ చింతన్‌ శివిర్‌ను అడ్డుకుంటామని హెచ్చరించింది.

రాజస్థాన్‌లో రాజపుత్రులు బీజేపీకి మద్దతుగా నిలవడం, జాట్లు కాంగ్రెస్‌కు అండగా ఉండటం చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. ఈ విషయాన్ని గుర్తించే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పద్మావత్‌ సినిమాను మార్పులు లేకుండా విడుదలకు అనుమతి వద్దని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. అంతే కాదు ఆ తర్వాత ఆ సినిమాను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు ఆ తర్వాత కొట్టేసింది.  

ఈ ఏడాది జరిగే రాజస్థాన్‌ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామని భావిస్తున్న కాంగ్రెస్‌ ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణిసేనను వ్యతిరేకించడం సరైన చర్య కాదని భావిస్తోంది. రాజస్థాన్‌లో రాజకీయంగా బాగా పట్టున్న సామాజిక వర్గం రాజ్‌పుత్‌.  రాష్ట్ర జనాభాలో  వారు 12శాతముంటారు. కనీస పాతిక అసెంబ్లీ స్థానాల్లో ఫలితాల్ని తారుమారు చేయగల సత్తా ఆ వర్గానికి ఉంది.  జాట్లు మినహా మిగిలిన ఏ సామాజికవర్గాలు కూడా రాజస్థాన్‌లో రాజ్‌పుత్‌లను వ్యతిరేకించే పరిస్థితి లేదు. రాజ్‌పుత్‌లు తన సమస్యలపైనే కాదు ఇతర సామాజికవర్గాల సమస్యలపైనా పోరాటం చేస్తుంటారు.  ప్రస్తుత రాజస్థాన్‌ అసెంబ్లీ  దాదాపు పాతిక మంది రాజ్‌పుత్‌ ఎమ్మెల్యేలున్నారు.  పద్మావత్‌ సినిమాను నిషేధించాలని కోరుతూ సంతకాల ఉద్యమం చేపట్టింది  జైపూర్‌ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి.  ఆమె బీజేపీ ఎమ్మెల్యే కూడా.  

ఆర్. పరమేశ్, సాక్షి

మరిన్ని వార్తలు