విచారణ ఖైదీల పరిస్థితి బాధాకరం

18 Dec, 2017 02:06 IST|Sakshi

బెయిల్‌ వచ్చినా పేదరికంతో జైల్లోనే మగ్గుతున్నారు

ఢిల్లీ హైకోర్టు ఆందోళన

వారికి ఊరట కలిగించేలా ట్రయల్‌ కోర్టులకు మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: విచారణ ఖైదీలకు (అండర్‌ ట్రయల్‌) బెయిల్‌ వచ్చినా పేదరికం కారణంగా బాండ్‌/పూచీకత్తు సమర్పించలేక తీహార్‌ జైలులోనే కొట్టుమిట్టాడుతున్నారని, ఇదీ చాలా బాధాకరమైన అంశమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వారికి ఊరట కలిగించేలా ట్రయల్‌ కోర్టులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్, జస్టిస్‌ సి.హరిశంకర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మార్గదర్శకాలు ఇచ్చింది.

ఎంతటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఖైదీలైనా ఎటువంటి పరిస్థితుల్లోనూ వారి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పులు వెలువరించిందని ధర్మాసనం స్పష్టం చేసింది. లా కమిషన్‌ కూడా విచారణ ఖైదీల విషయంలో రిస్క్‌ అస్సెస్‌మెంట్‌ చేసి.. బెయిల్‌ షరతులను పూర్తి చేయలేక జైలులోనే మగ్గుతున్న వారిని విడుదల చేయాలని సూచించిందని పేర్కొంది. ఇలాంటి కేసుల విషయంలో సున్నితంగా వ్యవహరించాలని, బెయిల్‌ వచ్చినా విచారణ ఖైదీ ఎందుకు విడుదల కాలేదనే విషయంపై సమీక్షించి బెయిల్‌ షరతులను మార్చాలంది.

వారి కోసం చట్టం!
న్యూఢిల్లీ: చేయని తప్పునకు శిక్ష అనుభవించిన బాధితులకు పరిహారం ఇచ్చేలా మన దేశంలో చట్టం ఉందా?.. ఢిల్లీ హైకోర్టు సూచన మేరకు ఈ విషయమై లా కమిషన్‌ పరిశీలన మొదలుపెట్టింది. చేయని తప్పునకు శిక్ష అనుభవించిన, తీవ్రంగా విచారించబడిన బాధితులకు పరిహారం ఇచ్చేందుకు చట్టపరమైన పరిష్కారాలు లేకపోవడంపై హైకోర్టు ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి బాధితులకు ధనం, ఇతర పరిహారం ఇచ్చేందుకు అమెరికాలో 32 రాష్ట్రాల్లో చట్టాలున్నా యని నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీఎస్‌ బాజ్‌పాయ్‌ నివేదికను ప్రస్తావించింది.

మరిన్ని వార్తలు