ఏడుగురు పాక్ రేంజర్ల హతం

22 Oct, 2016 00:41 IST|Sakshi
ఏడుగురు పాక్ రేంజర్ల హతం

జమ్మూ సరిహద్దులో ఓ ఉగ్రవాది కూడా.. బీఎస్‌ఎఫ్ జవానుకు గాయాలు
 
 పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్ బలగాలు
- సరిహద్దుల్లో రెండు చోట్ల కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాక్
 
 జమ్మూ: దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత బలగాలు దీటైన సమాధానం చెప్పాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడటంతో బీఎస్‌ఎఫ్ దళాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. జమ్మూలోని కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ బీఎస్‌ఎఫ్ జవాను కూడా గాయపడ్డాడు.

శుక్రవారం ఉదయం 9.35 గంటల సమయంలో కథువా జిల్లా హిరానగర్ సెక్టార్‌లో భారత ఔట్‌పోస్ట్‌లపై పాక్ రేంజర్లు స్నైపర్ దాడులు జరిపారని బీఎస్‌ఎఫ్ తెలిపింది. దీంతో భారత బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయని, ఏడుగురు పాక్ రేంజర్లు, ఓ ఉగ్రవాది మరణించారని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఇదే ప్రాంతంలో అంతకుముందు పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. గుర్నామ్ సింగ్‌ను జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి చికి త్స అందజేస్తున్నట్టు చెప్పారు.

కథువా జిల్లాలోనే గురువారం ఆరుగురు ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేసిన కొద్ది గంటలకే పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడటం గమనార్హం. కాగా, సరిహద్దుల్లోని జమ్మూ జిల్లా అక్నూర్ సెక్టార్‌లోని పర్గ్వాల్ బెల్ట్‌లోనూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినట్టు శుక్రవారం ఉదయం బీఎస్‌ఎఫ్ ఐజీ(జమ్మూ) డీకే ఉపాధ్యాయ వెల్లడించారు. తాము పాక్ బలగాలకు దీటుగా సమాధానం చెప్పామని, వారికి భారీ నష్టాన్ని చేకూర్చామని చెప్పారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, చొరబాటు యత్నాలను ఎదుర్కొనేందుకు బలగాలను సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, వారికి సాయం చేసేందుకే పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారని ఆరోపించారు.

 చొరబాటు కుట్ర భగ్నం
 మరోవైపు.. వాస్తవాధీన రేఖకు సమీపంలోని పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. భారీగా ఆయుధాలతో ఉగ్రవాదులు పూంచ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో చొరబాటుకు ప్రయత్నించారని, దానిని భద్రతా బలగాలు సమర్థంగా భగ్నం చేశాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. దీంతో ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారన్నారు.
 
 ‘సర్జికల్’ తర్వాత 31వ సారి
 భారత్ సర్జికల్ దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం ఇది 31వ సారి. గత నాలుగు రోజుల్లో పాక్ కాల్పులకు తెగబడటం ఇది ఐదోసారి. కాగా, శుక్రవారం భారత, పాక్ దళాల మధ్య కాల్పులు జరిగాయని, పంజాబ్ ప్రావిన్స్‌లోని షకార్‌గఢ్ సెక్టార్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కాల్పులు సుమారు అర గంట పాటు కొనసాగాయని తెలిపింది. అయితే పాక్ మీడియా మాత్రం భారత బలగాల కాల్పుల్లో ఐదుగురు పాక్ రేంజర్లు హతమైనట్టు పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు