తెల్ల జెండాలతో వచ్చి శవాలను తీసుకెళ్లారు

15 Sep, 2019 04:07 IST|Sakshi

భారత కాల్పుల్లో మరణించిన పాక్‌ జవాన్లు

రెండు రోజుల కాల్పుల తర్వాత దిగొచ్చిన పాక్‌

న్యూఢిల్లీ: భారత సైన్యాన్ని కాల్పులతో ఎదుర్కోలేక పాకిస్తాన్‌ ఆర్మీ తెల్ల జెండాతో హాజిపిర్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖలోకి ప్రవేశించింది. భారత్‌–పాక్‌ సైన్యాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాక్‌ ఆర్మీ ఈ పద్ధతిని ఎంచుకుంది. దీనికి ముందు పాక్‌ ఎల్‌ఓసీలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించి కాల్పులు జరిపింది. దీంతో భారత ఆర్మీ కూడా తిరిగి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఈ నెల 10న పాక్‌ సైనికుడు గులాం రసూల్‌ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాక్‌ తిరిగి కాల్పులు జరుపుతూ చొరబడాలని ప్రయత్నించింది.

భారత సైన్యం తిరిగి కాల్పులు జరపడంతో మరో సైనికుడు మృతిచెందాడు. దీంతో రెండు రోజుల తర్వాత పాక్‌ సైన్యం తెల్ల జెండాతో ముందుకొచ్చింది. తెల్ల జెండా పట్టుకొని ఉంటే కాల్పులు జరపబోమని సంకేతం. ఈ జెండాతో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. మరణించిన ఇద్దరినీ పంజాబ్‌కు చెందిన ముస్లింలుగా భావిస్తున్నారు. జూలై 30–31న కీరన్‌ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో దాదాపు ఏడు మంది పాక్‌ సైనికులు మరణించినప్పటికీ, పాక్‌ వారి మృతదేహాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. బహుశా వారు కశ్మీర్‌ నేపథ్యం ఉన్నవారుగానీ, పాకిస్తాన్లోని ఉత్తర లైట్‌ ఇన్‌ఫాంట్రీకి చెందిన వారు అయి ఉండవచ్చని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కేవలం పంజాబీ పాకిస్తానీలు మరణిస్తేనే పాక్‌ ముందుకు వస్తుందని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు