కర్తార్‌పూర్‌ ద్వారా పాక్‌ ఆదాయం ఏడాదికి రూ.259కోట్లు

25 Oct, 2019 08:47 IST|Sakshi

న్యూఢిల్లీ : పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ మందిరానికి, పాక్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారాకు మధ్య సిక్కు యాత్రికుల రాకపోకలకు సంబంధించి ప్రతిష్టాత్మక కర్తార్‌పూర్‌ కారిడార్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాంతాల మధ్య రాకపోకలకు సంబంధించి భారత్‌, పాక్‌ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వీసా అవసరం లేకుండా యాత్రికులు పాక్‌లోని కర్తార్‌పూర్‌కు వెళ్లే అవకాశాన్ని ఈ కారిడార్ కల్పిస్తోంది. ప్రతిరోజు దాదాపు 5,000 మంది యాత్రికులను అనుమతించనున్నారు. అయితే ప్రతి యాత్రికుడి నుంచి పాక్ 20 డాలర్లు వసూలు చేసేందుకు నిర్ణయించింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పాక్ వెనక్కు తగ్గలేదు. దీంతో.. భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని భారత్ ఈ ఒప్పందానికి అంగీకరించింది.

ఈ విషయం అలా ఉంచితే.. సర్వీస్ చార్జీ వల్ల పాక్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాలా ఏడాదికి  259 కోట్ల రూపాయలు. దీనికి యాత్రికులు చేసే ఇతరత్రా ఖర్చులు కూడా తోడవనున్నాయి. ఇక్కడికి వెళ్లే యాత్రికులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నిబంధనల ప్రకారం ప్రయాణికులు గరిష్టంగా రూ. 11వేలు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి ఒక ఆన్‌లైన్‌ పోర్టల్‌ prakashpurb550.mha.gov.inను ఏర్పాటు చేశారు. ఇందులో తమకు కావాల్సిన రోజుల్లో టికెట్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే ప్రయాణానికి మూడు రోజుల ముందు సమాచారం ఇవ్వబడుతుంది. ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పాకిస్థాన్‌కు ఈ రాబడి కొంతమేర రక్షిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిక్కు యాత్రికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఒప్పందం కుదుర్చుకున్నాయి. సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ దేవ్‌ 550 జయంతి ఉత్సవాల సందర్భంగా నవంబర్‌ 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ భారత్‌ - పాక్‌లు సంయుక్తంగా ప్రారంభించనున్నాయి.

చదవండికర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు