‘బాలాకోట్‌’ రిపీట్‌కు పాక్‌ యత్నం!

28 Mar, 2019 04:40 IST|Sakshi

20 యుద్ధ విమానాలు, 1000 కిలోల బాంబుల మొహరింపు

తిప్పికొట్టిన భారత వాయుసేన

ఫిబ్రవరి 27 నాటి పరిణామాలు వెలుగులోకి

న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన మరుసటి రోజు అదే తరహాలో భారత భూభాగంలో దాడులకు పాకిస్తాన్‌ విఫలయత్నం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా అదే నెల 26న పాకిస్తాన్‌ భూభాగంలోని బాలాకోట్‌లో భారత వైమానిక దళం దాడులు నిర్వహించి ముష్కరులకు భారీగా నష్టం కలిగించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి రోజు అంటే ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ పాకిస్తాన్‌ సైన్యానికి చిక్కారు. వార్తా సంస్థ ఏఎన్‌ఐ కథనం ప్రకారం..ఆ రోజు పాకిస్తాన్‌ సుమారు 20 యుద్ధ విమానాలతో భారత్‌పై బాలాకోట్‌ తరహా దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది.

అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్‌–16తో పాటు ఫ్రెంచ్‌ మిరాజ్‌–3, చైనీస్‌ జేఎఫ్‌–17 విమానాల సాయంతో సుమారు 1000 కిలోల బాంబులను పూంచ్, దాని సమీపంలోని మూడు చోట్ల భారత ఆర్మీ శిబిరాల వైపు విసిరింది. సరిహద్దుకు 50 కిలో మీటర్ల పరిధిలోని తన భూభాగం నుంచే పాకిస్తాన్‌ ఆర్మీ ఈ దాడులకు పాల్పడింది. అయితే భారత యుద్ధ విమానాలు సకాలంలో స్పందించడంతో పాకిస్తాన్‌ లక్ష్యం నెరవేరలేదు. దీంతో ఆ బాంబులను అక్కడికక్కడే వదిలి వెళ్లిపోయారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు. కశ్మీర్‌లోని ఓ సైనిక స్థావరంపై బాంబులు జారవిడిచినప్పుడు అక్కడ ఉన్న పెద్ద చెట్టు అడ్డుకుందని తెలిపారు. ఆ సమయంలో అదే భవనంలో సీనియర్‌ అధికారులు ఉన్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు