భారత సైనికుడి అప్పగింత

22 Jan, 2017 02:03 IST|Sakshi
భారత్‌కు చేరుకున్న జవాను చందూ

అట్టారీ: గతేడాది పొరపాటున నియంత్రణ రేఖ దాటిన భారత సైనికుడ్ని పాకిస్తాన్‌ శుక్రవారం విడుదల చేసింది. చందూ బాబూలాల్‌ చవాన్‌ అనే ఈ సైనికుడ్ని వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు పాక్‌ అప్పగించింది. మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన చందూ రాష్ట్రీయ రైఫిల్స్‌ విభాగంలో సైనికునిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపిన కొన్ని గంటల అనంతరం చందూ పొరపాటున సరిహద్దు దాటడంతో అతన్ని పాక్‌ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అప్పట్నుంచి అతన్ని విడిపించేందుకు కేంద్ర రక్షణ శాఖ, విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖలు చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది.

చందూ విడుదలకు అంగీకరించిన పాకిస్తాన్‌ శుక్రవారం అతన్ని విడుదల చేసింది. దీనిపై రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్‌ మాట్లాడుతూ.. జవాన్‌ విడుదల కోసం తమ సామర్థ్యం మేర కృషి చేసినట్లు చెప్పారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా తగిన సహకారం అందించిందని పేర్కొన్నారు. చందూను క్షేమంగా దేశానికి తీసుకొచ్చేందుకు తీసుకున్న చర్యల వల్లే.. నేడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అతను విడుదలయ్యాడని తెలిపారు. మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ నిరంతరం పాక్‌తో సంప్రదింపులు జరిపినట్లు వివరించారు.

>
మరిన్ని వార్తలు