కుక్కతోక.. పాక్‌?!

21 Sep, 2017 19:02 IST|Sakshi
కుక్కతోక.. పాక్‌?!
  • పాక్‌ రేంజర్ల కవ్వింపులు
  • తిప్పికొడుతున్న భధ్రతా బలగాలు

  • కశ్మీర్‌ : పాకిస్తాన్‌ తన వక్ర బుద్ధిని మరోసారి చూపించింది. బుధవారం అర్దరాత్రి నుంచి పాక్‌ రేంజర్లు.. నియంత్రణ రేఖ, ఇంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతున్నారు.  ఈ మధ్య కాలంలో పాకిస్తాన్‌ యధేచ్ఛగా కాల్పులు విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతోంది. సరిహద్దులోని  ఆర్‌ఎస్‌ పురా, ఆర్నియా గ్రామాల వద్ద పహారా కాస్తున్న భారత సైన్యంపై పాక్‌ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. తేలికపాటి మోర్టార్లు ఆయుధాలతో మన భద్రతా దళాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన బీఎస్‌ఎఫ్‌ దళాలు ప్రతిగా కాల్పులకు దిగడం‍తో.. పాక్‌ రేంజర్లు తోకముడిచారు. పాక్‌ రేజంర్ల కాల్పుల్లో పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. సుమారు 12 పెంపుడు జంతువులు మరణించాయి. ఆర్నియా గ్రామంలోని పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది.

    బుధవారం బనిహాల్ ప్రాంతంలో సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్‌బీ) దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఓ హెడ్‌కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బనిహాల్ టన్నెల్ భద్రత కోసం పనిచేసే ఎస్ఎస్‌బీ బృందం... విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. కాగా కరేన్ సెక్టార్లో పాక్ సైనిక మూకలు కాల్పులకు తెగబడడంతో అక్కడ గస్తీ కాస్తున్న ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయాడు.

    ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బనిహాల్‌ పట్టణంలో కొత్తగా మిలిటెంట్‌ గ్రూపులో చేరిన ముగ్గురిపై అనుమానాలున్నాయని.. ఈ ఘటనతో వారికి సం‍బంధం ఉన్నట్లు తెలుస్తోందని ఎస్‌ఎస్‌బీ అధికారులు చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి నాలుగు ఖాళీ పిస్టల్‌ క్యాట్రిడ్జ్‌లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
     

మరిన్ని వార్తలు