భారత్‌ ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేస్తే.. పాక్‌ లష్కరే, హిజ్బుల్‌ను సృష్టించింది

24 Sep, 2017 01:23 IST|Sakshi

పాక్‌ నేతలు ఇప్పటిౖకైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి

ఉగ్రవాద జాబితాపై భద్రతా మండలిలోనే ఐకమత్యం లేకపోతే ఎలా?

ఐరాస సర్వసభ్య సమావేశంలో సుష్మా

ఐక్యరాజ్యసమితి: భారతదేశం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మ విద్యాసంస్థల్ని నెలకొల్పి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వైద్యులు, ఇంజనీర్లను తయారుచేస్తుంటే.. పాకిస్తాన్‌ మాత్రం ఉగ్రవాదుల్ని ఉత్పత్తి చేస్తోందని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. ప్రపంచ ఐటీ శక్తిగా భారత గుర్తింపు పొందితే.. ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా పాకిస్తాన్‌ ఎందుకు అపఖ్యాతి పాలవుతుందో ఆ దేశ పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు.

72వ ఐరాస సాధారణ అసెంబ్లీలో శనివారం సుష్మా ప్రసంగిస్తూ.. విధ్వంసం, మారణహోమం, క్రూరత్వాన్ని ప్రపంచానికి ఎగుమతి చేయడంతో పాకిస్తాన్‌ ముందువరుసలో ఉందని విరుచుకుపడ్డారు. అలాంటి దేశం ఐరాస వేదికపై నుంచి మానవత్వం గురించి మాట్లాడుతూ.. కపట ప్రదర్శనలో విజేతగా నిలిచిందని సుష్మా స్వరాజ్‌ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదం మానవజాతి అస్తిత్వానికే ప్రమాదకరమని,  ఉగ్రవాదుల జాబితాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలే ఆమోదించకపోతే.. ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఎలా పోరాటం చేయగలదని ఆమె ప్రశ్నించారు.  

‘కొద్ది గంటల తేడాతో భారత్, పాకిస్తాన్‌లు స్వాతంత్య్రం పొందాయి. భారతదేశం ప్రపంచ ఐటీ శక్తిగా గుర్తింపు పొందితే.. ఉగ్రవాద ఎగుమతి కేంద్రంగా పాకిస్తాన్‌ ఎందుకు పేరుపడింది. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్‌ రాజకీయ నాయకులకు నేను చెప్పాలనుకుంటున్నాను’ అని సుష్మా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోయడమే ప్రధాన లక్ష్యంగా పాకిస్తాన్‌ పనిచేసినా.. వాటిని అధిగమించి భారత్‌ పురోగమించిందని చెప్పారు.  

‘స్వాతంత్య్రం అనంతరం గత 70 ఏళ్లుగా భారత్‌ను అనేక పార్టీలు పాలించాయి. ప్రతీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం ఎంతో కొంత పాటుపడ్డాయి. ప్రపంచానికి గర్వకారణమైన ఐఐటీ, ఐఐఎంల్ని నెలకొల్పాం. కానీ ఉగ్రవాదం తప్ప ప్రపంచానికి పాకిస్తాన్‌ ఏమిచ్చింది?. మీరు ఉగ్రవాదుల్ని తయారు చేశారు. ఉగ్రవాద శిబిరాల్ని ఏర్పాటుచేశారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్‌ ముజాహిదీన్, హక్కానీ నెట్‌వర్క్‌ల్ని సృష్టించారు’అని పాకిస్తాన్‌పై సుష్మా నిప్పులు చెరిగారు. ఉగ్రవాదంపై పెట్టిన సమయాన్ని అభివృద్ధి కోసం ఆ దేశం వినియోగించుంటే.. ఇప్పుడు పాకిస్తాన్, ప్రపంచం సురక్షితంగా ఉండేవని చెప్పారు. పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలతో భారతదేశం ఒక్కటే కాకుండా.. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లు కూడా నష్టపోతున్నాయని అన్నారు.  

మోదీ స్నేహ హస్తాన్ని ఎందుకు తిరస్కరించారు?
ఐరాసలో శుక్రవారం పాక్‌ ప్రధాని చేసిన ఆరోపణల్ని సుష్మా తోసిపుచ్చుతూ.. శాంతి, మైత్రి కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ అందించిన స్నేహ హస్తాన్ని పాకిస్తాన్‌ ఎందుకు తిరస్కరించిందో సమాధానం చెప్పాలన్నారు. ‘ద్వైపాకిక్ష చర్చల ద్వారా అపరిష్కృత సమస్యల్ని పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందం, లాహోర్‌ డిక్లరేషన్‌ మేరకు భారత్‌–పాక్‌లు అంగీకరించిన విషయాన్ని పాక్‌ ప్రధాని మర్చిపోయారు. వాస్తవాల్ని మర్చిపోవడంలో పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు సిద్ధహస్తులు’ అని సుష్మా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

ఇలాగైతే ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు ఎలా..
‘మన శత్రువు ఎవరో నిర్వచించడంలో మన మధ్య అంగీకారం లేకపోతే కలిసికట్టుగా మనం ఎలా పోరాడగలం? మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు అని తేడాల్ని కొనసాగిస్తే ఉమ్మడి పోరు ఎలా సాధ్యం?’ అని జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌పై చైనా వైఖరిని పరోక్షంగా తప్పుపట్టారు. మసూద్‌పై నిషేధం విధించాలని ఐరాసలో భారత ప్రతిపాదనను పదే పదే భద్రతామండలి సభ్య దేశం చైనా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.

ఐరాసలో సుష్మా ప్రసంగం అద్భుతం: మోదీ
ఐరాసలో సుష్మా స్వరాజ్‌ ప్రసంగాన్ని ట్విటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఉగ్రవాద ముప్పు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం అంశాలపై సుష్మా స్వరాజ్‌ గట్టి సందేశాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఐరాసలో భార త విదేశాంగ మంత్రి అద్భుత ప్రసంగం చేశారని, ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేశారని ప్రధాని ట్వీట్‌ చేశారు.   

పేదరిక నిర్మూలనే మా లక్ష్యం
వాతావరణ మార్పులతో ఉత్పన్నమయ్యే సవాళ్లకు మాటలతో కాకుండా సరైన చేతలతో సమాధానం చెప్పాల్సిన అవసరముందని సుష్మా అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతికంగా, ఆర్థికంగా సాయం చేయాలని సూచించారు. నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమని సుష్మా పేర్కొన్నారు. జీఎస్టీ అమలుతో దేశమంతా ఒకపన్ను పనువిధానం అమలు చేస్తున్నామని చెప్పారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే భారతదేశ ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. జన్‌ధన్, ముద్ర, ఉజ్వల, డిజిటల్‌ ఇండియా వంటివన్నీ పేదలకు సాధికారత అందించేందుకు ఉద్దేశించినవని చెప్పారు. అణ్వస్త్ర వ్యాప్తి, సముద్ర రవాణా భద్రతకు ముప్పు అంశాలపై ఐరాసలో ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు