మరోసారి ‘గ్రే’ జాబితాలో పాక్‌

23 Jun, 2019 04:40 IST|Sakshi

యాక్షన్‌ ప్లాన్‌ అమలులో పాక్‌ విఫలమయిందన్న ఎఫ్‌ఏటీఎఫ్‌

తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక  

న్యూఢిల్లీ: అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదులకు ఆర్థికసాయం నిలిపివేత విషయంలో పాకిస్తాన్‌ ఘోరంగా విఫలమైందని ది ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) తెలిపింది. తాము నిర్దేశించిన 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్‌ ప్లాన్‌)ను పాక్‌ అమలు చేయలేకపోయిందని విమర్శించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ను మరోసారి ‘గ్రే జాబితా’లోనే కొనసాగిస్తున్నామని వెల్లడించింది. ఈ సెప్టెంబర్‌ చివరికల్లా ఈ లక్ష్యాలను చేరుకోకుంటే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అమెరికాలో సమావేశమైన ఎఫ్‌ఏటీఎఫ్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఎఫ్‌ఏటీఎఫ్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ..‘పాకిస్తాన్‌ నిర్ణీత లక్ష్యాలను చేరుకోనందున ఆ దేశాన్ని ‘గ్రే జాబితా’లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నాం. తమ భూభాగంలోని ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా కచ్చితమైన, విశ్వసించదగ్గ స్థాయిలో, శాశ్వత ప్రభావం చూపేలా చర్యలు తీసుకోవాలని పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆదేశించింది. గడువులోగా అంటే ఈ ఏడాది సెప్టెంబర్‌లోపు ఎఫ్‌ఏటీఎఫ్‌ కార్యాచరణ ప్రణాళికను అమలుచేయాలని స్పష్టం చేసింది’ అని తెలిపారు.  

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ కన్నెర్ర..
ఉగ్రసంస్థలు లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) చీఫ్‌ హఫీజ్‌ సయీద్, జైషే మొహమ్మద్‌(జేఈఎం) అధినేత మసూద్‌ అజర్‌లపై సరైన చర్యలు తీసుకోవడంలో పాక్‌ విఫలమైందని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎఫ్‌ఏటీఎఫ్‌ కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలుచేయడానికి పాకిస్తాన్‌ చర్యలు తీసుకోవాలని భారత్‌ డిమాండ్‌ చేసింది.

>
మరిన్ని వార్తలు