సరిహద్దు దాటాడు.. మిఠాయి ఇచ్చి పంపారు

28 Jun, 2018 16:49 IST|Sakshi
సరిహద్దులు దాటి జమ్ము కశ్మీర్‌, పూంచ్‌ జిల్లాలో ప్రవేశించిన పీఓకే బాలుడు

నగ్రోటా, జమ్మూ కశ్మీర్‌ : కెనడా యువతి ఒకరు బీచ్‌లో జాగింగ్‌ చేస్తూ అనుకోకుండా దేశ సరిహద్దులను దాటి అమెరికాలో ప్రవేశించిన వార్తను ఈ మధ్యే చూశాం. ఇలాంటిదే మరో సంఘటన ఇప్పుడు మన దేశంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)కు చెందిన 11 ఏళ్ల మహ్మద్‌ అబ్దుల్లా అనే కుర్రాడు ఈ నెల 24న పొరపాటున జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్‌ జిల్లాలో ప్రవేశించాడు.

బాలుడిని గమనించిన స్థానికులు వివరాలు తెలుసుకుని అదే రోజున అతన్ని జమ్మూ కశ్మీర్‌ పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు మహ్మద్‌ను తిరిగి అతని స్వస్థలానికి పంపించడానికి అవసరమైన లాంఛనాలను పూర్తి చేసి కొత్త బట్టలు, మిఠాయిలు ఇచ్చి మరీ మహ్మద్‌ను అతని సొంత ఊరికి పంపించారు అధికారులు.

ఈ విషయం గురించి మాట్లాడిన డిఫెన్స్‌ అధికారి ఒకరు ‘భారత సైన్యం విలువలకు కట్టుబడి ఉంటుంది. అమాయకుల పట్ల మేం జాగ్రత్తగా వ్యవహరిస్తాం. అతను పెరిగి పెద్దవాడవుతున్న క్రమంలో భారత్‌-పాక్‌ సంబంధాల గురించి మంచిగానే ఆలోచించాలి. భారత్‌ అంటే నమ్మకం కలగాలి. అందుకే మానవతా దృష్టితో మేం మహ్మద్‌ను తిరిగి పంపించాం’ అన్నారు.

మరిన్ని వార్తలు