జాధవ్‌ను కలుసుకోవచ్చు!

2 Aug, 2019 03:43 IST|Sakshi
కుల్‌భూషణ్‌ జాధవ్‌

ఎట్టకేలకు న్యాయసహాయం!

కుల్‌భూషణ్‌తో భారత దౌత్యాధికారుల భేటీకి పాక్‌ ఓకే

న్యూఢిల్లీ: పాక్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌కు ఎట్టకేలకు న్యాయసహాయం పొందే అవకాశం దక్కింది. భారత దౌత్యాధికారులు జాధవ్‌ను శుక్రవారం కలుసుకోవచ్చని భారత విదేశాంగశాఖకు పాక్‌ గురువారం సమాచారమిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం భారత్‌ దౌత్యాధికారులు జాధవ్‌ను కలుసుకోవచ్చునని పాక్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్‌ ఫైజల్‌ చెప్పారు. గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై పాక్‌ సైనిక కోర్టు జాధవ్‌కు వేసిన మరణశిక్షను పునః పరిశీలించాలని ఇటీవల అంతర్జాతీయ కోర్టు చెప్పింది.

న్యాయ సహాయం అంటే..
1963 వియన్నా ఒప్పందం ప్రకారం రెండు స్వతంత్ర దేశాల మధ్య న్యాయ సహాయ సంబంధాలు ముఖ్యం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 36 ప్రకారం ఏదైనా దేశం విదేశీ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటే వారి హక్కుల్ని కాపాడడానికి ఆలస్యం చేయకుండా అరెస్ట్‌కు సంబంధించిన విషయాన్ని ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారం అందించాలి. అరెస్ట్‌కి కారణాలు వివరించాలి. తనకు లాయర్‌ కావాలని నిర్బంధంలోని వ్యక్తి కోరితే ఆ ఏర్పాటు చేయాల్సిందే.  

భారత్‌కు ఎలా ప్రయోజనం ?  
ఇన్నాళ్లూ ఏకపక్షంగా విచారణ జరిపి జాధవ్‌ గూఢచారి అని పాక్‌ ముద్రవేసింది. లాయర్‌ని నియమిస్తే జాధవ్‌ వైపు వాదన ప్రపంచానికి తెలుస్తుంది. అతని అరెస్ట్‌ వెనుక నిజానిజాలు వెలుగు చూస్తాయి. పాకిస్తాన్‌ కుటిలబుద్ధిని బయటపెట్టే అవకాశం భారత్‌కు లభిస్తుంది. 

మరిన్ని వార్తలు