మరోసారి వక్రబుద్దిని చాటుకున్న పాకిస్తాన్‌

7 Sep, 2019 18:59 IST|Sakshi

గగనతల అనుమతి అభ్యర్థనను తోసిపుచ్చిన పాక్‌

న్యూఢిల్లీ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటనకు తమ గగనతలం ఉపయోగించుకునేందుకు నిరాకరించింది. మూడురోజుల విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కోవింద్‌ సోమవారం ఐస్‌ల్యాండ్‌కు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో రామ్‌నాథ్ కోవింద్ ప్రయాణించే విమానం పాక్ గగనతలం మీదుగా ఐస్‌ల్యాండ్‌కు వెళ్లేందుకు అనుమతించాలంటూ భారత్‌ పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. అనుమతిని నిరాకరిస్తున్నామని పాకిస్తాన్‌ శనివారం వెల్లడించింది. 

రామ్‌నాథ్ కోవింద్ ప్రయాణించే విమానం పాక్ గగనతలం మీదుగా  వెళ్లేందుకు అనుమతించాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని తమ ప్రభుత్వం తోసిపుచ్చినట్టు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి తెలిపారు. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమ గగనతలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వరాదనే నిర్ణయానికి పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆమోదం తెలిపారని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ఏ దేశమైన గగనతల అనుమతి అభ్యర్థనను మంజూరు చేస్తాయి.

(చదవండి : ‘గాజులు పంపమంటారా’ అంటూ పాక్‌ రెచ్చగొడుతోంది)

కాగా, ఐస్‌ల్యాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియాలో రాష్ట్రపతి కోవింద్ మూడు రోజుల పర్యటన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తన పర్యటనలో భాగంగా ఆయా దేశాల ముఖ్య నాయకులను ఆయన కలుసుకుంటారు. పుల్వామా దాడితో సహా ఈ ఏడాది ఉగ్రవాద ఘటనలు పెరిగిన దృష్ట్యా భారతదేశ ఆందోళనను వారి దృష్టికి  కోవింద్ తీసుకువెళ్లే అవకాశాలున్నాయి.

ఇటీవల పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం, దీనికి ప్రతిగా పాక్‌‌లోని బాలాకోట్‌లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత వాయుసేన దాడులు జరపడంతో గత ఫిబ్రవరి 26న పాకిస్థాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. అయితే, గత మార్చిలో పాక్షికంగా గగనతలాన్ని తెరిచినప్పటికీ భారతదేశ విమానాలపై మాత్రం నిషేధం అమలు చేస్తోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా