ముంబై పేలుళ్ల సూత్రధారికి భద్రత పునరుద్ధరణ

18 May, 2018 22:38 IST|Sakshi
హఫీజ్‌ సయీద్‌ (ఫైల్‌ ఫొటో)

లాహోర్‌: ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్‌-ఉద్‌-దవా, లష్కరే తోయిబా అధిపతి హఫీజ్‌ సయీద్‌కు పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి భద్రతను పునరుద్ధరించింది. అవసరం లేకున్నా ప్రభుత్వం తరఫున భద్రతా సేవల్ని పొందుతున్న వారికి తక్షణం సెక్యూరిటీని తొలగించాలని పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలతో పంజాబ్‌ ప్రభుత్వం సయీద్‌కు భద్రతను ఉపసంహరించింది. దీనిపై హఫీజ్‌ లాహోర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.

అవసరం లేకున్నా ప్రభుత్వం తరఫున సెక్యూరిటీ సేవల్ని అందిస్తున్నారని సుప్రీం చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి తనకు పంజాబ్‌ రాష్ట్రం భద్రతను తొలగించిందని హఫీజ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన ప్రాణాలకు నిజంగానే ముప్పు ఉందని కోర్టుకు విన్నవించుకున్నాడు. కాగా, ప్రాణాలకు ముప్పు ఉన్న వారికి సెక్యూరిటీని కల్పించాలని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ తన ఉత్తర్వులను సవరించడం గమనార్హం. హఫీజ్‌ ప్రాణాలకు ముప్పు ఉన్నందునే భద్రతను పునరుద్ధరించామని పంజాబ్‌ ముఖ్యమంత్రి షాబాజ్‌ షర్ఫీ తెలిపారు. సయీద్‌ లాహార్‌ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నాడు.

మరిన్ని వార్తలు