బాలాకోట్‌ నుంచి బిచాణా ఎత్తేశారు!

8 Jul, 2019 02:43 IST|Sakshi

పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దులకు తరలిన ఉగ్ర శిక్షణ శిబిరాలు

భారత దౌత్య కార్యాలయాలకు పొంచి ఉన్న ముప్పు

నిఘా విభాగాలు అప్రమత్తం

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌ సరిహద్దుల్లోకి మకాం మార్చాయి. పాక్‌లోని బాలాకోట్‌ ఉగ్ర శిక్షణ శిబిరంపై ఫిబ్రవరిలో భారత వైమానిక దళం దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం ఉగ్రసంస్థలు తమ మకాంను అఫ్గానిస్తాన్‌లోకి మార్చేశాయి. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలు కునార్, నంగర్‌హార్, నూరిస్తాన్, కాందహార్‌లలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. దీంతో భారత నిఘా వర్గాలు కాబూల్, కాందహార్‌లలో ఉన్న దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేశాయి. అఫ్గాన్‌ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో చేతులు కలిపిన జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దు డ్యూరాండ్‌ రేఖ వెంబడి శిక్షణ శిబిరాలను నెలకొల్పి, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి 14వ తేదీన కశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మొహమ్మద్‌ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా అదే నెలలో భారత వైమానిక దళం బాలాకోట్‌పై బాంబు దాడులు జరిపింది. అంతర్జాతీయ ఒత్తిడులకు లొంగిన పాక్‌ ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో లష్కరే తోయిబాకు చెందిన 15 మంది నేతలను అదుపులోకి తీసుకుంది. అయితే, ఇవన్నీ కంటి తుడుపు చర్యలేనని భారత్‌ అంటోంది. నిర్దిష్టమైన చర్యలతో ఉగ్రమూకలను కట్టడి చేయాలని కోరుతోంది. మరోవైపు, పాక్‌ ఉగ్ర సంస్థలకు దన్నుగా ఉంటోందంటూ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) సంస్థ ఆర్థిక సాయం నిలిపివేసింది. దీంతో ఆర్థికంగా కుంగిపోయిన పాక్‌పై ఒత్తిడి తీవ్రమైంది.

ఈ నేపథ్యంలోనే ఉగ్ర సంస్థలు పాక్‌ నుంచి తమ మకాంను అఫ్గానిస్తాన్‌కు మార్చాయని భారత్‌ నిఘా వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ పరిణామంతో అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌తోపాటు కాందహార్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయాలకు ఉగ్ర ముప్పు పెరిగిందని హెచ్చరిస్తున్నాయి. జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులతోపాటు, పేలుడు పదార్థాలు అమర్చిన వాహనాలతో కాబూల్‌ ఎంబసీపై కారివరి గుల్‌ అనే ఉగ్ర సంస్థ దాడులకు దిగే ప్రమాదముందని అనుమానిస్తున్నాయి. కాందహార్‌లోని ఇండియస్‌ ఎంబసీపై తాలిబన్లు కూడా దాడులకు పాల్పడే ప్రమాదముందని అంటున్నాయి. 

తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లు జైషే మొహమ్మద్‌ అధిపతి మసూద్‌ అజార్‌కు ఆశ్రయం కల్పించేందుకు ఫిబ్రవరిలో ముందుకు వచ్చినా పాక్‌లోని భావల్పూర్‌లో సైనిక రక్షణ మధ్య ఉండటమే శ్రేయస్కరమని అతడు ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. అంతేకాకుండా, కాబూల్, కాందహార్‌ల్లో ఉన్న భారత కార్యాలయాలపై ఈ ఉగ్ర సంస్థలు నిఘా వేసి ఉంచాయి. జనవరిలో సెదిక్‌ అక్బర్, అతావుల్లా అనే ఇద్దరు ఉగ్రవాదులను అఫ్గాన్‌ బలగాలు అదుపులోకి తీసుకుని, విచారించగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి.

అమెరికా బలగాలకు ముప్పు
లష్కరే తోయిబా కూడా తన అనుచరులను నంగర్‌హార్, నూరిస్తాన్, కునార్, హెల్మండ్, కాందహార్‌ ప్రావిన్సుల్లోని శిక్షణ శిబిరాలకు తరలించింది. పెషావర్‌లో ఉన్న సభ్యుల మకాంను కాబూల్‌కు మార్చింది. తాలిబన్‌ సాయంతో విధ్వంసక, విద్రోహ చర్యలపై శిక్షణ ఇస్తోంది. మరోవైపు, అఫ్గానిస్తాన్‌లో ఉన్న 300 మంది జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులతో అమెరికా, సంకీర్ణ బలగాలకు ముప్పు ఉననట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌ కూడా తన నివేదికలో పేర్కొంది. తాలిబన్, ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖైబర్‌–పక్తున్వా మధ్య రాజీ కుదర్చడంలో జైషే మొహమ్మద్‌ పాత్ర ఉందని తెలిపింది.

మరిన్ని వార్తలు