భారత సైన్యానికి పాక్ రుణపడి ఉండాలి: సమీ

4 Oct, 2016 13:04 IST|Sakshi
భారత సైన్యానికి పాక్ రుణపడి ఉండాలి: సమీ

భారత సైన్యానికి పాకిస్థాన్ ఎంతగానో రుణపడి ఉండాలని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సమీ అన్నాడు. బజరంగీ భాయీజాన్ సినిమాలో అతిథిపాత్రలో కూడా నటించిన సమీ.. దీనిపై మరింత వివరణ ఇచ్చాడు. ఇరు దేశాలకు ఉన్న ఉమ్మడి శత్రువుపైనే తాను ట్వీట్లు చేశానన్నాడు. రెండు దేశాలతో పాటు మిగిలిన ప్రపంచాన్ని కూడా ఇబ్బంది పెడుతున్న ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని చెప్పాడు. అలాంటి ఉగ్రవాదులను హతమార్చినందుకు భారత సైన్యానికి పాకిస్థాన్ కృతజ్ఞతలు చెప్పాలన్నాడు. తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని పాకిస్థాన్ చాలా సంవత్సరాలుగా చెబుతోందని, పొరుగుదేశం వాళ్లకు సాయం చేస్తున్నా.. కనీసం దాన్ని ఒప్పుకొనే పరిస్థితిలో కూడా వాళ్లు లేరని అన్నాడు.

తాను ఎప్పుడూ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, తన ట్వీట్లను వాళ్లు తమకు కావల్సిన రీతిలో వక్రీకరించుకున్నారని అద్నాన్ సమీ అన్నాడు. అందుకే వాళ్లు పాకిస్థానీలను.. ఉగ్రవాదులను ఒకేలా చూస్తున్నారని మళ్లీ ట్వీట్ చేశానని చెప్పాడు. తాను ఒక్క దేవుడికి తప్ప ఎవరికీ భయపడేది లేదని.. ఒకవేళ తన తలరాతలో మళ్లీ పాకిస్థాన్ వెళ్లాలని రాసి ఉంటే.. అలాగే వెళ్తానని, తిరిగి వెళ్లడానికి కూడా తాను భయపడేది లేదని తెలిపాడు.

నిజానికి ఉడీ ఉగ్రదాడి తర్వాత.. భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత రెండు దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో దానిపై కాస్త హుందాగా స్పందిస్తున్న కళాకారుడి పేరు చెప్పుకోవాలంటే.. అద్నాన్ సమీ పేరు ముందొస్తుంది. స్వతహాగా పాకిస్థాన్‌కు చెందిన సమీ.. ఆ తర్వాత భారత పౌరసత్వం తీసుకున్నారు. ఉడీ ఉగ్రదాడిలో 19 మంది భారత సైనికులు మరణించిన విషయం తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడానికి భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా మన సైన్యానికి అభినందనలు తెలిపి, ప్రధానిని కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేపడుతున్న చర్యలను మెచ్చుకున్నారు.

మరిన్ని వార్తలు