ఆమె నోట పాక్‌ పాట

21 Feb, 2020 08:55 IST|Sakshi
నినాదాలు చేస్తున్న అమూల్యను అడ్డుకుంటున్న పోలీసులు

పాకిస్తాన్‌కి జైకొట్టిన సీఏఏ నిరసనకారిణి  

ఫ్రీడంపార్క్‌ సభలో కలకలం యువతి అరెస్టు  

నిరంతరం భారత్‌పై విషంగక్కే శత్రుదేశానికి మద్దతుగా జయధ్వానాలు. అది కూడా చారిత్రక ఫ్రీడంపార్క్‌లో వందలాది మధ్య నినాదాలు. సీఏఏ వ్యతిరేక కార్యకర్త అమూల్య లియోన్‌ చర్యతో ప్రశాంతత భగ్నమైంది. పోలీసులు తక్షణం ఆమెను నిర్బంధించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో ఈ తరహా సంఘటనలు పెరగడం గమనార్హం.  

సాక్షి, బెంగళూరు:  బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో అపచారం చోటుచేసుకుంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం జరిగిన ఆందోళనలో అమూల్య లియోన్‌ అనే యువతి వేదికపై పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని నినదించడం సంచలనం కలిగించింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఆమెను వేదిక మీద నుంచి కిందకు తీసుకొచ్చి సమీపంలోని ఉప్పారపేట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ నుంచి రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. అమూల్య స్వస్థలం చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా శివపుర గ్రామవాసిగా గుర్తించారు. అలాగే అమూల్యను ఆ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానించారు.. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాల వెనుక కారణాలేవైనా ఉన్నాయా? ఇలా వివిధ కోణాల్లో విచారణ జరుగుతోంది. 

సంబంధం లేదు  
కాగా, అమూల్యకు ఈ కార్యక్రమంతో ఎలాంటి సంబంధం లేదని నిర్వాహకుడు ఇమ్రాన్‌ పాషా చెప్పారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరూ వ్యాఖ్యలు చేసినా అది నేరమేనన్నారు. ఆమెకు ఆహ్వానమే పంపలేదని, ఆమె వేదికపై ఎలా మాట్లాడిందో అర్థం కాలేదని తెలిపారు. 

నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు  
కాగా, అమూల్య వ్యాఖ్యలపై నిరసన భగ్గుమంటోంది.  పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. అమూల్య వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం కర్ణాటక రక్షణ వేదిక నిరసన, ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే అమూల్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంతా భావిస్తున్నారు. ఇది తాను పాల్గొనబోయే మూడో ఆందోళన, ఈ సభలో మాట్లాడబోతున్నట్లు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో రాసుకొంది. మరోవైపు కొన్నిరోజుల క్రితమే హుబ్లీలో కేఎల్‌ఈ ఇంజనీరింగ్‌ కాలేజీ ముగ్గురు ముస్లిం విద్యార్థులు పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని వ్యాఖ్యలు చేసి అరెస్టు అయిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు