సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌కు బ్రేకు

1 Mar, 2019 02:41 IST|Sakshi

లాహోర్‌/న్యూఢిల్లీ: భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. తొలుత ఈ రైల్వే సేవలను నిలిపేస్తూ పాకిస్తాన్‌ నిర్ణయం తీసుకోగా, ఆ తర్వాత భారత్‌ కూడా సంఝౌతాను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్‌ వెల్లడించగా, రైలులో ప్రయాణించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు భారత్‌ తెలిపింది.

ఢిల్లీ నుంచి పాక్‌కు వెళ్లేందుకు భారత్‌ నుంచి వెళ్లే రైలులో 27 మంది ప్రయాణికులు గురువారమే సరిహద్దు వద్ద ఉన్న భారత్‌లోని అట్టారీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కానీ పాకిస్తాన్‌ నుంచి రావాల్సిన రైలును ఆ దేశ అధికారులు నిలిపేశారు. దీంతో 27 మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకున్నారు. రెండు రైళ్ల సేవలు నిలిచిపోవడంతో అట్టారీ స్టేషన్‌ వద్ద ఇరు దేశాలకు చెందిన దాదాపు 40 మంది చిక్కుకుపోయారని సమాచారం.

సిమ్లా ఒప్పందంతో..
1971లో భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు 1976 జూలై 22న ప్రారంభమయ్యాయి. పాక్‌లోని లాహోర్‌ నుంచి ప్రతి సోమవారం, గురువారం బయల్దేరుతుంది. ఢిల్లీ నుంచి ప్రతి బుధవారం, ఆదివారం బయల్దేరుతుంది. ఈ రెండు రైళ్లు కూడా అట్టారీ స్టేషన్‌ వరకు వెళ్తాయి.
లాహోర్‌ స్టేషన్‌లో రోదిస్తున్న భారత ప్రయాణికురాలు

మరిన్ని వార్తలు