‘సముద్రంలో ఉగ్ర కల్లోలం’

29 Aug, 2019 12:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌ తీరం నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు, పాక్‌ కమాండోలు ప్రయత్నిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో బీఎస్‌ఎఫ్‌, భారత కోస్ట్‌గార్డ్‌ దళాలు అప్రమత్తమయ్యాయి. చిన్నపాటి పడవల ద్వారా పాక్‌ నేవీతో శిక్షణ పొందిన ఉగ్రవాదులు, కమాండోలు గుజరాత్‌లోని కచ్‌,సర్‌ క్రీక్‌ ప్రాంతాలకు చేరుకోవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. గుజరాత్‌ తీరం, ఇతర రేపుల్లో అండర్‌వాటర్‌ దాడులు జరగవచ్చన్న సమాచారంతో గుజరాత్‌ తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఉగ్రవాదులు రేవులు, ఓడలపై సముద్ర జలాల్లోనుంచే భీకర దాడులు జరపడంలో శిక్షణ పొందినట్టు నిఘా వర్గాలు సమాచారం చేరవేశాయి.

పాక్‌ ఉగ్ర కదలికలపై ఇప్పటికే పలు పోర్టులు, గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌ను నిర్వహించే అదానీ గ్రూప్‌ తరహా ప్రైవేట్‌ పోర్టు నిర్వాహకులకు సమాచారం అందడంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోర్టు ప్రాంతంలో, సముద్ర జలాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు చోటుచేసుకుంటే తక్షణమే సమాచారం అందించాలని నౌకాధికారులు, పోర్టు సిబ్బంది, అధికారులకు సూచనలు జారీ అయ్యాయి. తీరప్రాంతంలో గస్తీ నిర్వహించే సెక్యూరిటీ ఏజెన్సీలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అనుమానాస్పద నౌకలు, వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. అన్ని పోర్టులతో పాటు తీర ప్రాంతమంతటా భద్రతా, నావికా దళాలను పెద్దసంఖ్యలో మోహరించారు.

మరిన్ని వార్తలు