భారత్‌లోకి ఉగ్ర మూకలు?

30 Aug, 2019 04:15 IST|Sakshi
హై అలర్ట్‌ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు

చొరబడే అవకాశముందన్న నిఘా వర్గాలు

గుజరాత్‌ తీరంలో హై అలర్ట్‌

కాండ్లా, ముంద్రా పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం

కోయంబత్తూర్‌లో ఎన్‌ఐఏ సోదాలు

భుజ్‌(గుజరాత్‌)/కోయంబత్తూరు: కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆ దేశం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో గుజరాత్‌ తీరం కచ్‌ జిల్లాలోని కాండ్లా, ముంద్రా పోర్టులతోపాటు కీలక సంస్థల వద్ద హై అలర్ట్‌ ప్రకటించారు. ఉగ్ర సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) కేరళ–తమిళనాడు మాడ్యూల్‌ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోయంబత్తూర్‌లో ఎన్‌ఐఏ తనిఖీలు చేపట్టింది.

పాక్‌ కమాండోలు సముద్రం మీదుగా భారత్‌లోకి ప్రవేశించి మత విద్వేషాలు సృష్టించడంతోపాటు నీటిలో ఉండి దాడులకు తెగబడే అవకాశాలున్నాయంటూ భారత నేవీ హెచ్చరికలు పంపిన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. కచ్‌ తీరంలో అదానీ గ్రూప్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ముంద్రా పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఇది ఒకటి కాగా, ప్రభుత్వరంగ కాండ్లా నౌకాశ్రయం ద్వారా పెద్ద మొత్తంలో సరుకు రవాణా జరుగుతుంది. అరేబియా సముద్ర తీరంలోని ఈ రెండు పోర్టులు పాకిస్తాన్‌కు చేరువలో ఉన్నాయి.

ఇక్కడికి సమీపంలో జామ్‌నగర్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద రిలయన్స్‌ చమురుశుద్ధి కర్మాగారం, వడినార్‌ వద్ద రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌ ఆయిల్‌ రిఫైనరీలున్నాయి. ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కచ్‌ జిల్లాలోని కాండ్లా పోర్టుతోపాటు కీలక సంస్థల వద్ద భద్రతను భారీగా పెంచాం’ అని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (బోర్డర్‌ రేంజ్‌) డీబీ వఘేలా తెలిపారు. పోలీసులు, మెరైన్‌ బలగాలు, ఇతర భద్రతా సంస్థలు ఈ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశాయి. తీరప్రాంత భద్రతా చర్యలను పటిష్టం చేశామని, ఉగ్రవాదులు పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నయినా తిప్పికొట్టేందుకు బలగాలను అప్రమత్తం చేశామని డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ మురళీధర్‌ పవార్‌ తెలిపారు.

ఐఎస్‌ లింకులపై ఎన్‌ఐఏ తనిఖీలు
ఉగ్ర సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ కేరళ–తమిళనాడు మాడ్యూల్‌ కార్యకలాపాలపై కూపీ లాగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గురువారం కోయంబత్తూరులో విస్తృతంగా సోదాలు చేపట్టింది. ఎర్నాకులంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జారీ చేసిన వారంట్ల మేరకు నిందితుల సంబంధీకులకు చెందిన ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేశాం. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్, 5 సెల్‌ఫోన్లు, 4 సిమ్‌ కార్డులు, 1 మెమరీ కార్డు, 8 సీడీలు/డీవీడీలు, అభ్యంతరకర పత్రాలు లభించాయి. వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాం’ అని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఐఎస్‌ కార్యాకలాపాలకు సంబంధించిన సమాచారంపై కొందరిని ప్రశ్నించామని తెలిపింది. కాగా, గత వారం రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడిన లష్కర్‌–ఇ– తైబా ఉగ్ర సంస్థ సభ్యులతో వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెడదారి పట్టిన యువతను సోషల్‌ మీడియా ద్వారా కొందరు వ్యక్తులు ఐఎస్‌ ఉగ్ర సంస్థలోకి ఆకర్షించి కేరళ, తమిళనాడుల్లో దాడులకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ మేలో కేసులు నమోదు చేసింది.

>
మరిన్ని వార్తలు