భారత పైలట్‌కు పాక్‌ చిత్రహింసలు!

27 Feb, 2019 17:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ దాడులను తిప్పి కొట్టే క్రమంలో ఆ దేశ ఆర్మీకి చిక్కిన భారత పైలట్‌ను పాక్‌ చిత్రహింసలకు గురిచేస్తోంది. యుద్ద ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పాకిస్తాన్‌ భూభాగంలో మిగ్‌-21 విమానం కూలిపోయినప్పుడు పారాచ్యూట్‌ ద్వారా భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ భూభాగంలో దిగారు. దీంతో అభినందన్‌ను పట్టుకున్న పాక్‌ ఆర్మీ విచక్షణారహితంగా దాడి చేశారు. అభినందన్‌ ఛాతి భాగంలో పిడిగుద్దులు గుద్దుతూ రక్తం వచ్చేలా కొట్టారు. పారాచ్యూట్‌ ద్వారా దిగినప్పుడు అభినందన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ పాక్‌ రిలీజ్‌ చేసిన వీడియోలో ఆయన ఒంటిపై గాయాలు కనిపిస్తున్నాయి. అయితే అభినందన్‌పై దాడి చేసింది పాక్‌ సైనికులా లేదా ఉగ్రవాదులా తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ కూడా ధృవీకరించలేదు. (ఎవరీ విక్రమ్ అభినందన్‌?)

యుద్దంలో చనిపోతే వీరమరణం పొందొచ్చు.. కానీ శత్రువులకు దొరికితే నరకం కనిపిస్తుంది. దీన్ని నివారించేందుకే ప్రపంచ దేశాలు జెనీవా ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఒప్పందం ప్రకారం యుద్ధంలో చిక్కిన శత్రు సైనికులను హింసించరాదు. కానీ పాక్‌ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అభినందన్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. కాగా తనపై పాక్‌ ఆర్మీ దాడి చేయలేదని అభినందన్‌ తెలిపారు. స్థానికులు తనపై దాడి చేస్తుంటే పాకిస్తాన్‌ సైన్యమే తనను కాపాడిందని అబినందన్‌ చెబుతున్న ఓ వీడియోను పాక్‌ విడుదల చేసింది. మరో వైపు అభినందన్‌ పాక్‌కు పట్టుబడడాన్ని భారత్‌ అధికారికంగా ధృవీకరించలేదు. మిగ్‌-21 విమానం కూలిపోయిందని, ఒక పైలట్‌ తప్పిపోయారని మాత్రమే భారత్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు