వాజ్‌పేయి ‘నియంత్రణ’ను దాటిన మోదీ

1 Oct, 2016 04:10 IST|Sakshi
వాజ్‌పేయి ‘నియంత్రణ’ను దాటిన మోదీ

- ఎల్వోసీలో సర్జికల్ దాడితో పాక్‌కు సరైన సమాధానం
- పెరుగుతున్న ఒత్తిడి నుంచి స్వల్ప ఊరట
- వ్యూహాత్మక ప్రతీకారంతో దౌత్యపరంగా విజయం
 
 న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు సర్జికల్ దాడుల ద్వారా బుద్ధి చెప్పేందుకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై పార్టీలకతీతంగా, దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. శాంతి కాముక దేశంగా పేరున్న భారత్.. ఎన్ని దాడు లు చేసినా.. ఉన్న పేరును పాడుచేసుకోదని ఇన్నాళ్లూ నమ్మిక పాక్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇవ్వటంతో ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. 70 ఏళ్ల స్వాంతంత్య్ర భారతంలో పాక్‌కు ఇలా దెబ్బకు దెబ్బ తరహాలో సమాధానం ఇచ్చే పరిస్థితులుంటాయని ఎవరూ అనుకోలేదు. 2014 ఎన్నికల ప్రచారంలో పాక్‌కు సరైన సమాధానం ఇవ్వటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. 56 అంగుళాల ఛాతీ చూపించలేక పోయాయని మోదీ పేర్కొన్నారు. దీంతో మోదీ పగ్గాలు చేపట్టగానే పాక్‌పై దాడులు తప్పవని అంతర్జాతీయంగా రాజకీయ నిపుణులు భావించారు. కానీ, రెండున్నరేళ్లలో మోదీ యుద్ధం దిశగా ఒక్క మాటకూడా మాట్లాడలేదు.

 ‘నియంత్రణ’లోనే వాజ్‌పేయి
 ఎన్డీఏ ప్రధానిగా కార్గిల్ యుద్ధానికి సై అన్నా.. పోఖ్రాన్-2 పరీక్షలను నిర్వహించి ప్రత్యర్థికి చేతలతో సమాధానం ఇచ్చినా వాజ్‌పేయికి సౌమ్యుడేనని పేరుండేది. కార్గిల్ యుద్ధంలో భారత ఆర్మీ జూలు విదల్చాలని వాజ్‌పేయి ఆదేశించినా.. అది ఎల్వోసీ పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఎప్పుడూ ‘నియంత్రణ’ రేఖ దాటలేదు. తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలోనూ.. పాక్ కవ్వింపులకు భారత ఆర్మీ అడపా దడపా సమాధానం ఇచ్చినా ఎల్వోసీ దాటి ముందుకెళ్లలేదు. కానీ మోదీకి ఆ పరిస్థితి లేదు. పఠాన్‌కోట్ ఘటన, కశ్మీర్లో జవాన్ల కాన్వాయ్‌లపై మిలిటెంట్ల దాడి వంటి ఘటనలతో గతంలో ఏ ప్రధానిపైనా లేనంత ఒత్తిడి మోదీపై పెరిగింది. రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్నా సాహసోపేతంగా పాక్‌పై నిర్ణయం తీసుకోలేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఆనాటి 56 అంగుళాల ఛాతీ ఏమైందన్న విపక్షాల ప్రశ్నకు మోదీ దగ్గర సమాధానం కరువైంది.

 బీజేపీకి కలిసొస్తుందా?
 గతేడాది కీలకమైన బిహార్‌లో బీజేపీ ఓటమి పాలైన నేపథ్యంలో.. వచ్చే ఏడాది యూపీ, గుజరాత్ అసెంబ్లీలకు ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికలకు ఈ సర్జికల్ దాడులతోపాటు.. పాక్‌కు దీటైన సమాధానం ఇవ్వటం కలిసొస్తాయని బీజేపీ నేతలంటున్నారు. యూపీలో మళ్లీ పగ్గాలందుకునే ప్రయత్నంలో.. పాక్‌పై అనుసరిస్తున్న ధోరణి పార్టీని ఆదుకుంటుందని లెక్కలేసుకుంటున్నారు.
 
 సరైన సమయంలో..
 పాకిస్తాన్ కవ్వింపునకు సరైన సమయంలో సమాధానం ఇస్తామని చెబుతూ వచ్చిన మోదీ.. ఉడీ ఘటనతో కార్యాచరణ ప్రారంభించారు. పాక్‌లో పరిస్థితులపై పక్కా అవగాహన ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సూచనలతో.. సర్జికల్ దాడులకు అనుమతించారు. ఉడీ ఘటనకు ప్రతీకారమే అయినా.. ఈ దాడులు మోదీకి చాలా కీలకం. పాపులారిటీ రేసులో ముందున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్‌పై సరైన చర్యలు తీసుకోకపోతే మోదీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. దీనికితోడు దేశ భద్రతను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రశ్నిస్తున్న సమయంలో మోదీ నియంత్రణ రేఖ దాటి ముందుకెళ్లే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఉగ్రవాద కేంద్రాలపైనా దాడులే జరిపినా.. అవసరమైతే పాక్‌కు బుద్ధి చెప్పేందుకూ వెనుకాడమన్నారు. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
 
 పాక్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి
 అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకిని చేసేందుకు దౌత్యపరంగా విజయం సాధిస్తున్న భారత్.. బుధవారం రాత్రి జరిపిన సర్జికల్ దాడులతో పాక్‌పై మరింత ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో పాక్ ఎదురుదాడి చేస్తే ఎలా ప్రతిఘటించాలి? పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు ఏమేం చేయాలి? అనే అంశాలపై భారత్ దృష్టి కేంద్రీకరించింది. సరిహద్దులో భద్రతా దళాల్ని మోహరిస్తూనే.. పాక్‌ను పలు రకాలుగా దెబ్బకొట్టే వివిధ మార్గాల్ని అన్వేషిస్తోంది.

>
మరిన్ని వార్తలు