ఆగని పాక్ కాల్పులు

23 Oct, 2016 01:32 IST|Sakshi
ఆగని పాక్ కాల్పులు

జమ్మూ: జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ బలగాల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ జిల్లా ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలు, ఆర్మీ స్థావరాలపై పాక్ రేంజర్లు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీగా కాల్పులు, మోర్టారు బాంబు దాడులకు పాల్పడ్డారు. వీటిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. శుక్రవారం భారత జవాన్ల ఎదురు కాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోటానా ఖుర్ద్, అబ్దులియాన్‌లలో పొరుగు దేశ బలగాలు కాల్పులకు తెగబడ్డాయని, బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డీకే ఉపాధ్యాయ చెప్పారు.

ఈ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు భారత జ వాన్ ఒకరు కాపలా టవర్ నుంచి కిందికి దూకాడని, అతని కాలికి గాయాలయ్యాయని తెలిపారు. పాక్ కాల్పుల వల్ల హిరానగర్ సెక్టార్‌లోని వెయ్యిమంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారని చెప్పారు. బాబియా గ్రామం నుంచి 400 మందిని ఆర్మీకి చెందిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

మరిన్ని వార్తలు