ఎల్వోసీ సమీపంలో పాక్‌ హెలికాప్టర్‌ చక్కర్లు

22 Feb, 2018 03:48 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తోన్న పాకిస్తాన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్తాన్‌ సైన్యానికి చెందిన ఎంఐ–17 హెలికాప్టర్‌ ఒకటి బుధవారం ఉదయం 9.45 గంటలకు నియంత్రణ రేఖ(ఎల్వోసీ)కు 300 మీటర్ల సమీపంలోకి చొచ్చుకొచ్చింది. అనంతరం కొద్దిసేపటికే వెనక్కి తిరిగి వెళ్లిపోయింది.

ఈ ఘటన పూంచ్‌ జిల్లాలోని గుల్పూర్‌ సెక్టార్‌లో జరిగినట్లు ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎల్వోసీకి సమీపంలోకి వచ్చిన పాక్‌ హెలికాప్టర్‌పై భారత బలగాలు ఎలాంటి కాల్పులు జరపలేదనీ, పాక్‌ వైపు నుంచి కూడా ఎలాంటి దాడి జరగలేదని వెల్లడించారు. ఈ హెలికాప్టర్‌ను భారత ఆర్మీ బలగాలు స్పష్టంగా చూడగలిగాయన్నారు. ఎల్వోసీకి కి.మీలోపు హెలికాప్టర్లు, 10 కి.మీ.లోపు ఎలాంటి విమానాలు ఎగరరాదని ఇరుపక్షాలు గతంలో అంగీకారానికి వచ్చినట్లు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు