ఆ పాటలతో పైలట్లు గజగజా వణికిపోతున్నారు

4 Oct, 2016 10:11 IST|Sakshi
ఆ పాటలతో పైలట్లు గజగజా వణికిపోతున్నారు

న్యూఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని విమానాశ్రయాల్లో విమానాలు దించాలంటేనే భారత పైలట్లు భయపడుతున్నారు. వారికి ఆ అనుభవాలు నిద్రలేని రాత్రులుగా మిగులుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లంట. జమ్మూకశ్మీర్ లోని విమానాశ్రయాల్లో విమానాలు ల్యాండింగ్ చేసే సమయంలో తొలుత పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంభాషిస్తారు. వారు క్లియరెన్స్ ఇచ్చాకే విమానాన్ని దించుతారు. అయితే, ఇలా ఎప్పుడైతే విమానం దించే అనుమతి కోసం పైలెట్లు ఏటీసీని సంప్రదిస్తారో పాక్ కు చెందిన హ్యాకర్లు వెంటనే వారి ఫ్రీక్వెన్సీని హ్యాక్ చేయడమే కాకుండా పాక్ కు చెందిన దేశభక్తి గీతాలు వారికి వినిపిస్తున్నారంట.

ఇలా అవసరం లేకుండానే, పాక్ దేశభక్తి గీతాలను భారత పైలట్లు కాక్ పీట్ లో వినాల్సి వస్తుందని, అది నరకంగా ఉండటమే కాకుండా పై అధికారులు ఎలా స్పందిస్తారో కూడా అర్ధంకానీ పరిస్థితి నెలకొందట. 'దిల్ దిల్ పాకిస్థాన్, జాన్ జాన్ పాకిస్థాన్'వంటి పాక్ దేశభక్తి గీతాలు పదేపదే తమకు విమానం ల్యాండింగ్ సమయంలో వినిపిస్తున్నాయని వారు ఆందోళన చేస్తున్నారు. ఈ తరహా గీతాలు హ్యాకింగ్ చేసి వినిపిస్తూ శత్రువుపై పగ తీర్చుకునే ఒక ఆయుధంగా పాక్ వీటిని ఉపయోగించుకుంటోందని వారు చెప్తున్నారు. సైనికులు నడిపే విమానాల్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందట.

మరిన్ని వార్తలు