కశ్మీర్‌లో పాక్ గూఢచారి అరెస్టు

23 Oct, 2016 01:14 IST|Sakshi
కశ్మీర్‌లో పాక్ గూఢచారి అరెస్టు

జమ్మూ: భద్రతా దళాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించిన  భోద్ రాజ్ అనే పాకిస్తాన్ గూఢచారిని జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. సైనికుల కదలికలు, విస్తరణ తదితర వివరాలు అతను సేకరించిన సమాచారంలో ఉన్నట్లు తెలిసింది. భారత సైనిక కదలికలకు సంబంధించిన ఓ మ్యాప్‌ను, రెండు పాక్ సిమ్‌కార్డులను అధికారులు అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి చాంగియా గ్రామంలో రాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఎస్‌పీ జోగిందర్ సింగ్ వెల్లడించారు.  భారత్‌లో తయారైన రెండు మొబైల్స్‌తో పాటు రూ.1711లను స్వాధీనం చేసుకున్నామని, విచారణ సాగుతున్నట్లు చెప్పారు.

ఇద్దరు జేఈఎం తీవ్రవాదుల అరెస్టు
శ్రీనగర్: ఇద్దరు జైషే మహ్మద్(జేఈఎం) తీవ్రవాదులను భద్రతా దళాలు శనివారం అరెస్టు చేశాయి. జమ్మూ కశ్మీర్ బారాముల్లా జిల్లాలో గత ఆగస్టు 16న జరిగిన ఓ దాడిలో వీరి ప్రమేయం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు సహా ఓ పోలీసు మృతిచెందారు.  అరెస్టయిన వారిని సాఫీర్ అహ్మద్ భట్, ఫర్హాన్ ఫయాజ్‌లుగా గుర్తించామని పోలీసు అధికారి పేర్కొన్నారు. ఏకే రైఫిల్, పిస్టల్‌లతో పాటు మందుగుండు సామగ్రిని వీరి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు