ఆయుధాలు నిండిన డ్రోన్‌ కలకలం

21 Jun, 2020 06:30 IST|Sakshi
సరిహద్దులో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చిన పాకిస్తాన్‌ డ్రోన్‌

పాక్‌ డ్రోన్‌ను కూల్చిన భారత్‌

జమ్మూ: రైఫిల్, గ్రెనేడ్‌లను మోసుకొస్తున్న ఓ డ్రోన్‌ పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి సరిహద్దు దాటి వచ్చింది. దీన్ని గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే కూల్చివేశాయి. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో శనివారం జరిగింది. జమ్మూ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. 17.5 కేజీల బరువున్న చైనా తయారీ డ్రోన్‌.. దాదాపు 5.5 కిలోల ఆయుధాలు మోసుకొచ్చింది. అందులో అమెరికాకు, చైనాకు చెందిన ఆయుధాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.

ఉదయం దాదాపు ఐదింటపుడు బార్డర్‌ ఔట్‌ పోస్ట్‌ నుంచి వస్తున్నడ్రోన్‌ను గస్తీకాస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గమనించి దాన్ని తొమ్మిది రౌండ్లు కాల్చి కూల్చివేశారు. అప్పటికే అది భారత్‌ లోకి 250 నుంచి 300 మీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పారు. ఈ డ్రోన్‌కు అత్యాధునిక రైఫిల్, ఏడు గ్రెనేడ్లు అమర్చి ఉన్నాయి. ఇవిగాక రేడియో సిగ్నల్‌ రిసీవర్, రెండు జీపీఎస్‌లు ఉన్నాయి. పాక్‌ ఉగ్రవాదులు భారత్‌లోని తమ ఏజెంట్లకు వీటిని చేర్చే ప్రయత్నం చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు